

తెలంగాణ ఆడపడుచుల ఆత్మగౌరవానికి, రాష్ట్ర సాంస్కృతిక వైభవానికి ప్రతీకగా నిలిచే సద్దుల బతుకమ్మ వేడుకలకు భాగ్యనగరం ముస్తాబైంది. పూల పండుగ ముగింపు వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు చారిత్రక ట్యాంక్‌బండ్ పరిసరాల్లో అధికారులు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. ఈసారి వేడుకల్లో టాలీవుడ్ స్టార్ విజయ్ దేవరకొండ, నేషనల్ క్రష్ రష్మిక మందన్న పాల్గొననున్నారనే వార్త అభిమానుల్లో ఆసక్తిని పెంచుతోంది. సంప్రదాయాలు, సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు ఆధునిక వినోదాన్ని మేళవిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఈ వేడుకలను ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించేందుకు సిద్ధమైంది.
రేపు, అక్టోబర్ 18న సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ట్యాంక్‌బండ్ పరిసరాల్లో సద్దుల బతుకమ్మ సంబరాలు జరగనున్నాయి. హుస్సేన్‌సాగర్ తీరంలో ప్రత్యేక లేజర్ షోతో పాటు తెలంగాణ జానపద కళలను ప్రతిబింబించేలా సుమారు 700 మంది కళాకారులు సాంస్కృతిక ప్రదర్శనలు ఇవ్వనున్నట్లు సమాచారం. రంగురంగుల పూలతో బతుకమ్మలను అలంకరించి తరలివచ్చే మహిళలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. పూల సంబరం, జానపద కళారూపాలు, విద్యుద్దీపాల వెలుగులు, సినీ తారల సందడితో ట్యాంక్‌బండ్ పండుగ శోభను సంతరించుకోనుంది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!