

వాహనాలకు నంబర్ ప్లేట్లు లేకుండా నడపడం, రిజిస్ట్రేషన్ నంబర్లను మార్ఫింగ్ చేయడం, ఇతరుల నంబర్లను వినియోగించడం, సరైన పత్రాలు లేకుండా వాహనాలు నడపడం వంటి ఉల్లంఘనలపై వరంగల్ పోలీసులు కఠిన చర్యలు చేపడుతున్నారు. గతంలో ఇలాంటి ఉల్లంఘనలకు జరిమానాలు విధించేవారు. అయితే, తాజాగా తనిఖీల్లో నంబర్ ప్లేట్లను మార్చినట్లు లేదా తప్పుడు నంబర్లను ఉపయోగించినట్లు గుర్తిస్తే వాహనాలను సీజ్ చేయడంతోపాటు చీటింగ్ కేసులు నమోదు చేస్తున్నారు. వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో వాహనాల సంఖ్య పెరుగుతుండటంతో ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతున్నాయి. చలాన్ల నుంచి తప్పించుకునేందుకు కొందరు వాహనదారులు నంబర్ ప్లేట్లను మారుస్తున్నట్లు గుర్తించిన పోలీసులు, ఇలాంటి అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకు తనిఖీలు ముమ్మరం చేశారు.
చీటింగ్ కేసులు నమోదైతే ముఖ్యంగా యువత, విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని పోలీసులు హెచ్చరిస్తున్నారు. విదేశాలకు వెళ్లే సమయంలో, ఉద్యోగాల కోసం జరిగే ధ్రువీకరణ ప్రక్రియలో సమస్యలు తలెత్తే అవకాశం ఉందని పేర్కొంటున్నారు. కేసు నమోదైన తర్వాత వాహనాన్ని సీజ్ చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించవచ్చు. అనంతరం కోర్టులో విచారణ కొనసాగుతుంది. ప్రభుత్వ నిబంధనల ప్రకారం వాహనంపై అధికారిక రిజిస్ట్రేషన్ నంబరునే ప్రదర్శించాలని హనుమకొండ ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ కె. ప్రవీణ్‌కుమార్ తెలిపారు. నెల రోజుల క్రితం వరంగల్‌లో ఓ ద్విచక్ర వాహనం ఇంజిన్ నంబరును పరిశీలించగా, నంబర్ ప్లేట్ మార్చినట్లు గుర్తించి కేసు నమోదు చేశారు. తాజాగా హనుమకొండలోని అశోక జంక్షన్ వద్ద తనిఖీల్లో మరో ద్విచక్ర వాహనం నంబర్‌కు, చలాన్లలో నమోదైన నంబర్‌కు తేడా కనిపించింది. విచారణలో నంబర్ ప్లేట్‌ను మార్ఫింగ్ చేసినట్లు గుర్తించడంతో చీటింగ్ కేసు నమోదు చేసినట్లు సమాచారం.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!