

ఈ నెల 22వ తేదీ వరకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్తో పాటు దక్షిణాది రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. తెలంగాణకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఎల్లో అలర్ట్ జారీ చేసింది. శనివారం ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, మహబూబ్నగర్, నాగర్కర్నూల్, వనపర్తి, నారాయణపేట, గద్వాల జిల్లాల్లో అక్కడక్కడా ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. శుక్రవారం మధ్యాహ్నం కురిసిన భారీ వర్షంతో తిరుపతి విమానాశ్రయం జలమయమైంది. కొత్త టెర్మినల్ వీఐపీ గేటు, పాత విమానాశ్రయం వీఐపీ గేటు వద్ద ప్రహరీ గోడలు కూలిపోగా, వర్షపు నీరు రన్వేపైకి చేరింది. ప్రతికూల వాతావరణం కారణంగా విజయవాడ నుంచి వచ్చిన విమానాన్ని చెన్నైకి మళ్లించారు.
ఈ నెల చివరి వారంలో బంగాళాఖాతం, అరేబియా సముద్రంలో వేర్వేరుగా అల్పపీడనాలు ఏర్పడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. వీటిలో ఒకటి బలపడి వాయుగుండంగా లేదా తుఫానుగా మారే అవకాశం ఉందని ఓ వాతావరణ నిపుణుడు పేర్కొన్నారు. ప్రస్తుతం భూమధ్యరేఖకు సమీపంలోని పశ్చిమ, మధ్య పసిఫిక్ సముద్రాల్లో ఉపరితల ఉష్ణోగ్రతలు సాధారణం కంటే సుమారు మూడు డిగ్రీలు ఎక్కువగా నమోదవుతున్నాయని నిపుణులు తెలిపారు. డిసెంబరు నాటికి ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఈ పరిణామాలు వాతావరణ పరిస్థితులపై ఎలాంటి ప్రభావం చూపుతాయనే అంశాన్ని నిపుణులు పరిశీలిస్తున్నారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!