

టాలీవుడ్ స్టార్ జంట విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న పెళ్లి తర్వాత తొలిసారిగా ప్రముఖ చాట్ షో ‘కాఫీ విత్ కరణ్’లో కలిసి సందడి చేశారు. ఈ షో ఫైనల్ సీజన్ రెండో ఎపిసోడ్‌లో పాల్గొన్న ఈ జంట తమ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. ముఖ్యంగా తమ పెళ్లి ప్రపోజల్ గురించి మాట్లాడుతూ విజయ్ దేవరకొండ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పెళ్లి చేసుకుందామని రష్మికే తనను అడిగిందని, తాను అంగీకరించేలోపు ఆమె దాదాపు 100 సార్లు అడిగి ఉంటుందని సరదాగా చెప్పారు. దీనిపై రష్మిక స్పందిస్తూ, తాను ఏడాది పాటు అడుగుతూనే ఉన్నానని వెల్లడించింది. దీంతో షోలో నవ్వులు విరిశాయి.
ఇదే కార్యక్రమంలోని రాపిడ్ ఫైర్ రౌండ్‌లో అల్లు అర్జున్, రణ్‌బీర్ కపూర్‌లలో ఎవరిని ఎంచుకుంటారని కరణ్ జోహార్ అడగ్గా, రష్మిక వెంటనే అల్లు అర్జున్ పేరు చెప్పింది. అలాగే, రష్మిక కాకుండా మరెవరితో తన ఆన్‌స్క్రీన్ కెమిస్ట్రీ బాగుంటుందని విజయ్‌ను ప్రశ్నించగా, రష్మిక ‘ఎవరితోనూ లేదు’ అని చమత్కరించింది. దీనిపై విజయ్ స్పందిస్తూ, సంతోషకరమైన వైవాహిక జీవితానికి తన మంత్రం భార్య చెప్పిన దానికి ఎప్పుడూ ఓకే చెప్పడమేనని నవ్వులు పూయించారు. మరోవైపు, గేమింగ్ సెగ్మెంట్‌లో విజయ్ తన ఫోన్ నుంచి అల్లు అర్జున్‌కు కాల్ చేసి కరణ్ జోహార్‌తో మాట్లాడించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!