

రామ్ చరణ్, దర్శకుడు సుకుమార్ కలయికలో తెరకెక్కనున్న ‘RC17’ సినిమా ప్రారంభోత్సవం కొద్దిగా ఆలస్యమైనట్లు తెలుస్తోంది. దసరా సందర్భంగా ఈ చిత్రాన్ని ప్రారంభించాలని తొలుత భావించినప్పటికీ, లొకేషన్ల ఎంపిక కోసం రామ్ చరణ్, సుకుమార్ యూకే వెళ్లడంతో కార్యక్రమం వాయిదా పడినట్లు సమాచారం. తాజాగా నిర్మాత మైత్రీ రవి ఈ ప్రాజెక్ట్‌పై అప్‌డేట్ ఇచ్చారు. అన్నీ అనుకూలిస్తే అక్టోబర్ 26 లేదా 27న ముహూర్తపు పూజా కార్యక్రమాలతో సినిమాను ప్రారంభించనున్నట్లు తెలిపారు. డిసెంబర్ నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలుపెట్టేందుకు చిత్ర బృందం సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఈ క్రేజీ కాంబినేషన్‌పై అభిమానుల్లో ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి.
మరోవైపు, ‘RC17’ను రెండు భాగాలుగా తెరకెక్కించాలని సుకుమార్ ఆలోచిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ ప్రతిపాదనకు రామ్ చరణ్ అంగీకరించినప్పటికీ, రెండు భాగాల విడుదల మధ్య ఎక్కువ కాలం విరామం ఉండకూడదని కోరినట్లు ప్రచారం జరుగుతోంది. ‘పుష్ప’ సీక్వెల్ తరహాలో విడుదలకు ఎక్కువ సమయం పట్టకుండా, కొన్ని నెలల వ్యవధిలోనే రెండు భాగాలను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చరణ్ భావిస్తున్నట్లు సమాచారం. ప్రతి సన్నివేశాన్ని ఎంతో శ్రద్ధగా తీర్చిదిద్దే దర్శకుడిగా పేరున్న సుకుమార్ ఈ లక్ష్యాన్ని ఎంతవరకు సాధిస్తారనేది ఆసక్తికరంగా మారింది. అయితే, రెండు భాగాల నిర్మాణం, విడుదల విరామం వంటి అంశాలపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!