

రణబీర్ కపూర్, యశ్, సాయి పల్లవి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న భారీ పౌరాణిక చిత్రం ‘రామాయణ’ విడుదలకు ముందే టికెట్ ధరల కారణంగా చర్చనీయాంశంగా మారింది. ఈ చిత్రం నవంబర్ 5, 2026న పలు భాషల్లో, విభిన్న ఫార్మాట్లలో థియేటర్లలో విడుదల కానుంది. పుణెలోని వాకడ్ ప్రాంతంలోని ఫీనిక్స్ మాల్ ఆఫ్ ది మిలీనియంలోని ఐనాక్స్ మెగాప్లెక్స్‌లో ఐమ్యాక్స్ రిక్లైనర్ సీట్ల టికెట్ ధర గరిష్ఠంగా రూ.2,820గా ఉన్నట్లు సమాచారం. క్లాసిక్ సీట్ల ధర రూ.1,350గా ఉండగా, సాధారణ 3డీ టికెట్ ధర సైతం సుమారు రూ.800గా ఉందని తెలుస్తోంది. దీంతో ఇంత భారీ మొత్తాన్ని వెచ్చించి సినిమా చూడటం అవసరమా? అంటూ పలువురు ప్రేక్షకులు సామాజిక మాధ్యమాల్లో చర్చిస్తున్నారు.
రెండు భాగాలుగా రూపొందుతున్న ‘రామాయణ’కు మొత్తం రూ.4,000 కోట్ల భారీ బడ్జెట్ ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే, ఈ పెట్టుబడిని రాబట్టుకునే క్రమంలో టికెట్ ధరలు పెంచితే సాధారణ ప్రేక్షకులు, కుటుంబాలు థియేటర్లకు రావడం కష్టమవుతుందని కొందరు అభిప్రాయపడుతున్నారు. నలుగురు సభ్యులున్న కుటుంబం ఒక్కో టికెట్‌కు రూ.800 చొప్పున చెల్లిస్తే టికెట్లకే రూ.3,200 ఖర్చవుతుంది. అదే రిక్లైనర్ సీట్లను ఎంచుకుంటే నాలుగు టికెట్లకు రూ.11,280 అవుతుంది. దీనికి ఆహారం, పార్కింగ్, ప్రయాణ ఖర్చులు అదనం. భారీ అంచనాలు, ప్రేక్షకుల్లో ఆసక్తి సినిమాకు మంచి ఓపెనింగ్స్‌ను తీసుకురావచ్చని భావిస్తున్నప్పటికీ, అధిక ధరల కారణంగా కొందరు ఓటీటీ విడుదల కోసం ఎదురుచూసే అవకాశం ఉంది. తెలుగు రాష్ట్రాల్లోనూ టికెట్ ధరలు పెరిగే అవకాశం ఉందన్న చర్చ జరుగుతున్న నేపథ్యంలో, బుకింగ్స్ ప్రారంభమైన తర్వాత ప్రేక్షకుల స్పందన ఎలా ఉంటుందో చూడాలి.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!