

‘హనుమాన్’, ‘మిరాయ్’ చిత్రాలతో ప్రేక్షకుల్లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న యువ హీరో తేజ సజ్జా త్వరలో వివాహ బంధంలోకి అడుగుపెట్టనున్నారు. డిసెంబర్‌లో రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో ఆయన వివాహ వేడుక జరగనుంది. ఈ విషయాన్ని తేజ స్వయంగా వెల్లడించినట్లు సమాచారం. తనది ప్రేమ వివాహం కాదని, పెద్దలు కుదిర్చిన వివాహమని ఆయన స్పష్టం చేశారు. నవంబర్‌లో నిశ్చితార్థ వేడుక నిర్వహించి, అనంతరం డిసెంబర్‌లో వివాహం జరపాలని కుటుంబ సభ్యులు నిర్ణయించినట్లు తెలుస్తోంది. సినీ ప్రముఖుల వివాహాల తరహాలో భారీ హంగామా కాకుండా, కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలోనే వేడుకను నిర్వహించుకోవాలని తేజ భావిస్తున్నట్లు సమాచారం.
తేజను వివాహం చేసుకోబోయే యువతికి సినీ పరిశ్రమతో సంబంధం లేదని తెలుస్తోంది. ఆమె కుటుంబం టెక్నాలజీ రంగంలో ఉండగా, తండ్రితో కలిసి ఆమె కూడా అదే వ్యాపారంలో పనిచేస్తున్నట్లు తేజ వెల్లడించారు. అమెరికాలో పెరిగిన ఆమెకు సినీ ప్రపంచం, సెలబ్రిటీల జీవనశైలిపై పెద్దగా పరిచయం లేదని పేర్కొన్నారు. ఆమె వ్యక్తిగత జీవితానికి, స్వేచ్ఛకు పెళ్లి తర్వాత కూడా తగిన గౌరవం ఇవ్వాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. ఉదయ్‌పూర్‌లో వివాహం అనంతరం హైదరాబాద్‌లో రిసెప్షన్ నిర్వహించనున్నారు. వ్యక్తిగత జీవితాన్ని ప్రైవేట్‌గా ఉంచేందుకు ఇష్టపడే తేజ తన వివాహ వేడుకలను కూడా నిరాడంబరంగా జరుపుకోవాలని నిర్ణయించుకోవడం అభిమానుల్లో ఆసక్తిని పెంచుతోంది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!