

బరువు పెరుగుతోందంటే చాలామంది శరీరంలో కొవ్వు పెరిగిందని భావిస్తారు. అయితే, శరీరంలో నీరు అధికంగా నిల్వ ఉండటం కూడా బరువులో ఆకస్మిక మార్పులకు కారణం కావచ్చు. ఈ పరిస్థితిని వాటర్ రిటెన్షన్ అంటారు. వైద్య పరిభాషలో ఎడెమా అనేది కణజాలాల్లో అదనపు ద్రవం పేరుకుపోవడం వల్ల ఏర్పడే వాపును సూచిస్తుంది. అధికంగా ఉప్పు తీసుకోవడం, హార్మోన్ల మార్పులు, ఎక్కువసేపు కూర్చోవడం లేదా నిలబడటం, శారీరక శ్రమ లేకపోవడం వంటి కారణాలతో ఈ సమస్య తలెత్తవచ్చు. ముఖ్యంగా మహిళల్లో రుతుక్రమం, గర్భధారణ వంటి సందర్భాల్లో హార్మోన్ల మార్పుల వల్ల శరీరంలో నీరు నిల్వ ఉండే అవకాశం ఉంది. కాళ్లు, చీలమండలు, చేతులు, వేళ్లు, ముఖం వాపు రావడం, బూట్లు లేదా ఉంగరాలు బిగుతుగా అనిపించడం, బరువులో అకస్మాత్తుగా హెచ్చుతగ్గులు కనిపించడం దీని ప్రధాన లక్షణాలు.
వాటర్ రిటెన్షన్‌ను నియంత్రించేందుకు ఆహారంలో ఉప్పు పరిమాణాన్ని తగ్గించడంతోపాటు, ప్యాకేజ్డ్ ఫుడ్స్, జంక్ ఫుడ్‌కు దూరంగా ఉండాలి. శరీర అవసరాలకు అనుగుణంగా తగినంత నీరు తాగడం, అరటిపండ్లు, ఆకుకూరలు వంటి పొటాషియం అధికంగా ఉండే ఆహారాలను తీసుకోవడం ఉపయోగకరంగా ఉంటుంది. రోజూ నడక, యోగా లేదా తేలికపాటి వ్యాయామాలు చేయడం, ఎక్కువసేపు ఒకే చోట కూర్చోకుండా మధ్యమధ్యలో కదలడం ద్వారా రక్త ప్రసరణను మెరుగుపరచుకోవచ్చు. అయితే, శరీరంలో నీరు నిల్వ ఉండటాన్ని కేవలం జీవనశైలి సమస్యగా భావించకూడదు. కొన్నిసార్లు ఇది మూత్రపిండాలు, గుండె లేదా కాలేయ సంబంధిత సమస్యలకు సంకేతం కావచ్చు. వాపు అకస్మాత్తుగా రావడం, తీవ్రంగా ఉండటం లేదా తగ్గకుండా కొనసాగడం వంటి లక్షణాలు కనిపిస్తే వైద్యులను సంప్రదించాలి.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!