

నితేశ్ తివారీ దర్శకత్వంలో, నమిత్ మల్హోత్రా నిర్మాణంలో తెరకెక్కుతున్న ‘రామాయణం’ చిత్రాన్ని వెండితెరపై చూసేందుకు ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాలో రణ్‌బీర్ కపూర్ శ్రీరాముడిగా, సాయిపల్లవి సీతగా, యశ్ రావణుడిగా నటిస్తున్నారు. అయితే, సినిమా ప్రమోషన్ల కోసం చిత్రబృందం అనుసరిస్తున్న విధానంపై కొంతమంది ప్రేక్షకుల నుంచి విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవల ఇతిహాసంలోని పాత్రలతో ఏడు మీమ్స్‌ను విడుదల చేయగా, వాటిలో ఒకటి చర్చకు దారితీసింది. ఆ మీమ్‌లో శ్రీరాముడి పాత్రలో ఉన్న రణ్‌బీర్ కపూర్ ఏడుస్తున్న దృశ్యాన్ని చూపిస్తూ.. “ఫ్రిజ్ తెరిచి చూస్తే నేను దాచుకున్న ఆహారాన్ని ఎవరో తినేసినప్పుడు” అనే అర్థం వచ్చే క్యాప్షన్‌ను జోడించారు. సినిమాలో ఇది భావోద్వేగభరితమైన సన్నివేశమని చెబుతున్న నేపథ్యంలో, దాన్ని హాస్య మీమ్‌గా ఉపయోగించడంపై కొంతమంది ప్రేక్షకులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.
భారత్‌లో చాలామంది రామాయణాన్ని పవిత్ర ఇతిహాసంగా భావిస్తారు. అందులోని గౌరవనీయమైన పాత్రలను హాస్యభరితమైన మీమ్స్‌లో ఉపయోగించి సినిమా ప్రమోషన్లు చేయడం తగదని కొందరు అభిప్రాయపడుతున్నారు. భారీ స్థాయిలో రూపొందుతున్న ఇలాంటి ప్రతిష్ఠాత్మక చిత్రానికి ప్రచారం మరింత సున్నితంగా, గౌరవప్రదంగా ఉండాల్సిందని వారు అంటున్నారు. గతంలో రామాయణం ఆధారంగా అనేక సినిమాలు, టెలివిజన్ రూపాంతరాలు వచ్చినప్పటికీ, తాజా ప్రచార విధానం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ప్రేక్షకుల నుంచి వస్తున్న విమర్శలను చిత్రబృందం పరిగణనలోకి తీసుకుని, రాబోయే ప్రమోషన్లలో మరింత జాగ్రత్తగా వ్యవహరిస్తుందా అన్నది ఆసక్తికరంగా మారింది. ఈ చిత్రానికి యశ్ కూడా నిర్మాతల్లో ఒకరు. ‘రామాయణం’ 2026 నవంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. సన్నీ డియోల్, వివేక్ ఒబెరాయ్, కాజల్ అగర్వాల్, రకుల్ ప్రీత్ సింగ్ తదితరులు కూడా నటిస్తున్న ఈ చిత్రానికి హాన్స్ జిమ్మర్, ఏ.ఆర్. రెహమాన్ సంగీతం అందిస్తున్నారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!