

యంగ్ హీరో ఆది సాయికుమార్ కథానాయకుడిగా తెరకెక్కనున్న కొత్త పాన్ ఇండియా చిత్రానికి ‘ఆది రుద్ర’ అనే శక్తిమంతమైన టైటిల్‌ను ఖరారు చేశారు. దర్శకుడు నవరసన్ తెరకెక్కిస్తున్న ఈ హై-వోల్టేజ్ డివైన్ మిస్టరీ థ్రిల్లర్‌ను త్రిశూల్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై నిర్మాత ప్రశాంత్ జి. రుద్రప్ప నిర్మిస్తున్నారు. దసరా సందర్భంగా చిత్ర బృందం టైటిల్‌తో పాటు కాన్సెప్ట్ పోస్టర్‌ను విడుదల చేసింది. 1960 నుంచి 1990 మధ్యకాలంలో సాగే ఈ కథలో చారిత్రక అంశాలు, దైవిక జానపద గాథలు, అతీంద్రియ శక్తులు, మానవ విశ్వాసాలను మేళవించనున్నారు. దర్శకుడు నవరసన్ రూపొందించిన కథ ప్రేక్షకులకు ఆధ్యాత్మిక రహస్యాలు, ఉత్కంఠభరితమైన సంఘటనలతో కూడిన సరికొత్త అనుభూతిని అందించనుంది.
ఈ సినిమాలోని పాత్ర కోసం ఆది సాయికుమార్ పూర్తిస్థాయి మేకోవర్‌కు సిద్ధమవుతున్నారు. కథకు అనుగుణంగా బలిష్టమైన శరీరాకృతిని సొంతం చేసుకునేందుకు కసరత్తులు చేస్తున్నారు. కన్నడ బ్లాక్‌బస్టర్ కాంతార చిత్రానికి సంగీతం అందించిన అజనీష్ లోక్‌నాథ్ ఈ సినిమాకు స్వరాలు సమకూర్చనున్నారు. చిత్ర రెగ్యులర్ షూటింగ్ 2027 జనవరి నుంచి ప్రారంభం కానున్నట్లు మేకర్స్ వెల్లడించారు. రెట్రో నేపథ్యం, దైవిక అంశాలు, అతీంద్రియ రహస్యాలతో రూపొందనున్న ‘ఆది రుద్ర’ ఆది సాయికుమార్ కెరీర్‌లో ప్రత్యేకమైన చిత్రంగా నిలవాలని చిత్ర బృందం భావిస్తోంది.



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!