

మీమర్‌గా కెరీర్ ప్రారంభించి హీరోగా గుర్తింపు తెచ్చుకున్న మౌళి, ఓ ఇంటర్వ్యూలో తనకు ఎదురైన చేదు అనుభవాలను పంచుకున్నారు. ఓ యూట్యూబ్ ఛానెల్ యాంకర్ తనతో కించపరిచేలా మాట్లాడటంతో తీవ్రంగా బాధపడ్డానని తెలిపారు. “ఆ మాటలు నన్ను ఎంతో బాధించాయి. పెద్ద కుటుంబం నుంచి వచ్చిన నటుడితో ఇలాగే మాట్లాడేవారా? లేక నేను ఏమీ చేయలేనని, చిన్నవాడిననే చులకన భావనతో అలా అన్నారా? అనేది అర్థం కాలేదు. ఆ సమయంలో ఏం చేయాలో తెలియక మౌనంగా ఉండిపోయాను. ఆ బాధను గత ఏడాది కాలంగా భరిస్తూనే ఉన్నాను” అని మౌళి వెల్లడించారు.
ముఖ్యంగా ‘లిటిల్ హార్ట్స్’ సినిమా విజయానంతరం ప్రశంసలతో పాటు ద్వేషం, అసూయను కూడా ఎదుర్కొన్నానని ఆయన తెలిపారు. సినిమా హిట్ అయిన సమయంలో ఓ వార్తా ఛానెల్ నుంచి ఇంటర్వ్యూకు రావాలని ఫోన్ వచ్చిందని, జ్వరం కారణంగా రాలేనని చెప్పగా, “నీ తర్వాతి సినిమా వచ్చినప్పుడు చూసుకుంటానులే” అంటూ సదరు వ్యక్తి హెచ్చరించాడని గుర్తుచేసుకున్నారు. దీంతో భయపడి మరుసటి రోజు ఆ ఛానెల్‌కు వెళ్లి ఇంటర్వ్యూ ఇచ్చానని చెప్పారు. నటుడిగా తనను తాను నిరూపించుకోవాలంటే ఇలాంటి అనుభవాలను కూడా ఎదుర్కోవాల్సి వస్తుందని మౌళి అభిప్రాయపడ్డారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!