

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కుమార్తె అల్లు అర్హ మరో విశేషమైన ఘనతను తన ఖాతాలో వేసుకుంది. కేవలం 5 ఏళ్ల వయసులోనే ‘నోబెల్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్’లో చోటు సంపాదించి ప్రపంచంలోనే అత్యంత పిన్న వయస్కురాలైన చెస్ ట్రైనర్లలో ఒకరిగా గుర్తింపు పొందింది. చిన్నారులలో చెస్‌పై ఆసక్తి పెంచేందుకు ఆమె చేసిన కృషిని గుర్తించి ఈ గౌరవాన్ని అందించినట్లు తెలుస్తోంది. ఈ వార్త బయటకు రావడంతో సినీ, క్రీడా వర్గాలతో పాటు అభిమానులు కూడా అల్లు అర్హకు అభినందనలు తెలుపుతున్నారు. చిన్న వయసులోనే ఇలాంటి అరుదైన గుర్తింపు దక్కడం విశేషమని సోషల్ మీడియాలో ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.
చెస్‌లో ప్రాథమిక అంశాలను తోటి చిన్నారులకు సులభంగా అర్థమయ్యేలా నేర్పించడం, వారిలో ఆటపై ఆసక్తిని పెంపొందించడం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని ఈ రికార్డు నమోదు చేసినట్లు సమాచారం. ఇప్పటికే గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘శాకుంతలం’ చిత్రంలో చిన్నారి భరతుడి పాత్రతో వెండితెరకు పరిచయమైన అల్లు అర్హ తన నటనతో కూడా ప్రశంసలు అందుకుంది. ఇప్పుడు వరల్డ్ రికార్డు సాధించడం మరో మైలురాయిగా నిలిచింది. పిల్లల అభిరుచులను చిన్నప్పటి నుంచే ప్రోత్సహిస్తున్న అల్లు అర్జున్, స్నేహా రెడ్డి దంపతులపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!