

నందమూరి బాలకృష్ణ, కొరటాల శివ కాంబినేషన్లో రూపొందనున్న ప్రతిష్టాత్మక చిత్రం గురించి సినీ వర్గాల్లో ఆసక్తికరమైన చర్చ సాగుతోంది. సామాజిక అంశాలను బలమైన భావోద్వేగాలతో మిళితం చేస్తూ కథలను తెరకెక్కించే కొరటాల, ఈసారి కూడా అలాంటి నేపథ్యాన్నే ఎంచుకున్నట్లు సమాచారం. ఈ చిత్రం రాయలసీమ ప్రాంతంలోని నీటి సమస్యలను ప్రధానాంశంగా తీసుకుని సాగుతుందని టాలీవుడ్లో ప్రచారం జరుగుతోంది. ప్రాంతీయ రాజకీయాలు, ప్రజల జీవన విధానం, కుటుంబ బంధాలు కథలో కీలకంగా మిళితమవుతాయని తెలుస్తోంది. ఆగస్టు నెలలో చిత్రీకరణ ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయని సమాచారం. బాలకృష్ణ ఈ సినిమాలో సరికొత్త లుక్‌లో కనిపించనున్నారని, ఇప్పటికే అందుకు సంబంధించిన సన్నాహాలు కూడా పూర్తయ్యాయని చెబుతున్నారు.
ఇక ఈ చిత్రంలో బాలకృష్ణ పాత్రకు రెండు భిన్న కోణాలు ఉండనున్నాయని టాక్ వినిపిస్తోంది. ముఖ్యంగా ఫ్లాష్‌బ్యాక్‌లో మాఫియా ఛాయలు ఉన్న పవర్ఫుల్ పాత్రలో ఆయన కనిపిస్తారనే ప్రచారం మరింత హైప్ తీసుకొచ్చింది. యాక్షన్‌తో పాటు కుటుంబ భావోద్వేగాలకు కూడా సమాన ప్రాధాన్యం ఇస్తూ కథను రూపొందించినట్లు తెలుస్తోంది. ‘దేవర’ తర్వాత కొరటాల శివ తెరకెక్కిస్తున్న సినిమా కావడంతో కథ, పాత్రల రూపకల్పనపై ప్రత్యేక శ్రద్ధ పెట్టారని సినీ వర్గాలు చెబుతున్నాయి. సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ ప్రాజెక్ట్ అధికారిక ప్రకటనల కంటే ముందే భారీ అంచనాలను సొంతం చేసుకుంటోంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!