

అమెరికాలోని నార్త్ కరోలినాలో తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ (టీటీఏ) నిర్వహించిన మెగా కన్వెన్షన్‌లో అమిత్, నటి దివి జంటగా నటించిన స్వతంత్ర ప్రేమగీతం హలో అమ్మాయిను ఘనంగా విడుదల చేశారు. ఇద్దరు సోలో ట్రావెలర్స్ అనుకోకుండా కలుసుకుని ప్రేమలో పడే కథాంశంతో రూపొందిన ఈ యూత్‌ఫుల్ సాంగ్‌ను అందమైన లొకేషన్లలో చిత్రీకరించారు. కార్యక్రమానికి నిర్మాత, ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజు, ప్రముఖ ఎన్ఆర్ఐ వ్యాపారవేత్త డాక్టర్ పైళ్ల మల్లారెడ్డి తదితరులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా దిల్ రాజు మాట్లాడుతూ అమిత్‌లో సహజమైన నటన ఉందని, సరైన ప్రోత్సాహం లభిస్తే టాలీవుడ్లో మంచి హీరోగా ఎదుగుతాడని ప్రశంసించారు. తెలుగు సినీ పరిశ్రమకు మరో యువ హీరో దొరికినట్టేనని వ్యాఖ్యానించారు. అమెరికాలో ప్రత్యేకంగా పాల్గొన్న నటి దివి, ప్రవాస తెలుగువారి ఆదరణకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రముఖ కొరియోగ్రాఫర్ సత్య మాస్టర్ కాన్సెప్ట్, కొరియోగ్రఫీ, దర్శకత్వం వహించిన ఈ పాటను లక్ష్మణ్ అనుగు నిర్మించారు. సురేష్ బనిసెట్టి సాహిత్యం అందించగా, అరుణ్ చిలివేరు సంగీతం సమకూర్చారు. గాయకుడు దీపు ఆలపించిన ఈ గీతం మధుర ఆడియో ద్వారా యూట్యూబ్‌లో విడుదలై మంచి స్పందన అందుకుంటోంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!