

సీఎం విజయ్ నటించిన 'జన నాయగన్' జులై 23న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమవుతున్న వేళ, తమిళనాడు, ఓవర్సీస్తో పాటు పలు ప్రాంతాల్లో అడ్వాన్స్ బుకింగ్స్ జోరుగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా దర్శకుడు హెచ్. వినోద్ సినిమా గురించి పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. ఇది విజయ్ చివరి చిత్రంగా కాకుండా ముఖ్యమంత్రి విజయ్ తొలి చిత్రంగా చూడాలని ఆయన వ్యాఖ్యానించారు. ఈ చిత్రం కేవలం కమర్షియల్ ఎంటర్టైనర్ మాత్రమే కాకుండా ప్రజాస్వామ్యాన్ని బలహీనపరిచే శక్తులు, దానిని కాపాడే వ్యక్తుల మధ్య జరిగే సంఘర్షణను ప్రతిబింబిస్తుందని తెలిపారు. విడుదల అనంతరం ఇందులోని రాజకీయ అంశాలపై ప్రేక్షకులు విస్తృతంగా చర్చిస్తారని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.
సినిమాకు 'జన నాయగన్' అనే టైటిల్ను ఎంపిక చేయడానికి కథలోని రాజకీయ నేపథ్యమే ప్రధాన కారణమని వినోద్ వెల్లడించారు. అలాగే కథా చర్చల సమయంలో విజయ్ సూచనతో 'భగవంత్ కేసరి'ను పరిశీలించినప్పటికీ, దానిని నేరుగా రీమేక్ చేయకుండా తమిళ ప్రేక్షకులు, విజయ్ శైలికి అనుగుణంగా పూర్తిగా కొత్తగా స్క్రీన్ప్లే రూపొందించినట్లు చెప్పారు. టీవీకే పార్టీ ప్రచారం కోసమే సినిమా తీశారన్న ప్రచారాన్ని ఆయన ఖండిస్తూ, ఎన్నికలకు ముందే కథ సిద్ధమైందని స్పష్టం చేశారు. ఇప్పటికే లీకైన కాపీలపై ఆందోళన వ్యక్తం చేసిన వినోద్, అయినప్పటికీ అభిమానులు థియేటర్లలో సినిమాను ఘన విజయవంతం చేస్తారనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు. ఈ చిత్రంలో పూజా హెగ్డే, బాబీ డియోల్, మమితా బైజు, ప్రకాష్ రాజ్, ప్రియమణి కీలక పాత్రల్లో నటించగా, అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!