

కన్నడ స్టార్ యశ్ నటిస్తున్న భారీ చిత్రం టాక్సిక్ గురించి గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో పలు రకాల ప్రచారాలు వినిపించాయి. సినిమా అవుట్‌పుట్‌పై యశ్ అసంతృప్తిగా ఉన్నాడని, కొన్ని కీలక సన్నివేశాలను మళ్లీ చిత్రీకరిస్తున్నారనే వార్తలు అభిమానుల్లో ఆందోళన కలిగించాయి. అయితే చిత్ర బృందం అధికారికంగా స్పందిస్తూ ఈ వార్తలను పూర్తిగా ఖండించింది. ప్రస్తుతం సినిమా పనులు ఎలాంటి ఆటంకం లేకుండా ప్రణాళిక ప్రకారమే కొనసాగుతున్నాయని స్పష్టం చేసింది. రీషూట్లపై వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని వెల్లడించింది.
సమాచారం ప్రకారం, ఈ చిత్రానికి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఇప్పటికే పూర్తయ్యాయి. ఫైనల్ కట్ సిద్ధంగా ఉండటంతో అదనపు చిత్రీకరణ అవసరం లేదని మేకర్స్ తెలిపారు. భారీ వ్యయంతో తెరకెక్కుతున్న ఈ సినిమా అంతర్జాతీయ స్థాయిలో కూడా మంచి ఆసక్తిని రేకెత్తిస్తోంది. అందుకే ఈ చిత్రాన్ని ఇంగ్లీష్‌లో కూడా ఒకేసారి విడుదల చేయాలనే యోచనలో ఉన్నట్లు సమాచారం. విదేశీ మార్కెట్‌ను లక్ష్యంగా చేసుకుని ప్రత్యేక ప్రచార కార్యక్రమాలు రూపొందిస్తున్నారు. నాన్ థియేట్రికల్ వ్యాపారం పూర్తయ్యాక కొత్త విడుదల తేదీ ప్రకటించే అవకాశం ఉంది. అన్నీ అనుకున్నట్లుగా జరిగితే ఈ ఏడాది ఆగస్టులో సినిమా విడుదల కావచ్చని సినీ వర్గాలు అంచనా వేస్తున్నాయి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!