

దాదాపు రెండేళ్లుగా నిలిచిపోయిన ‘ఇండియన్ 3’ ప్రాజెక్ట్ మళ్లీ వార్తల్లోకి వచ్చింది. కమల్ హాసన్, దర్శకుడు శంకర్ కలయికలో తెరకెక్కుతున్న ఈ చిత్ర పనులను తిరిగి ప్రారంభించనున్నట్లు లైకా ప్రొడక్షన్స్ ప్రకటించినట్లు సమాచారం. అయితే, సినిమా పూర్తి చేయడం కంటే దాని విడుదలపై స్పష్టత లేకపోవడమే ఇప్పుడు ప్రధాన సమస్యగా మారింది. థియేటర్లలో విడుదల చేస్తారా? లేక నేరుగా ఓటీటీలోకి తీసుకొస్తారా? అనే ప్రశ్నలు కోలీవుడ్లో చర్చకు దారితీశాయి. ‘ఇండియన్ 2’ విడుదలకు ముందే రెండు భాగాల చిత్రీకరణను శంకర్ పూర్తి చేశారు. రెండో భాగం చివర్లో మూడో భాగంపై ఆసక్తి పెంచే సన్నివేశాలను చూపించినప్పటికీ, 2024లో విడుదలైన ‘ఇండియన్ 2’ బాక్సాఫీస్ వద్ద నిరాశపరచడంతో మూడో భాగం భవిష్యత్తుపై అనిశ్చితి నెలకొంది.
ఇప్పటికే ఎక్కువ భాగం చిత్రీకరణ పూర్తయిన నేపథ్యంలో, మిగిలిన పనులను పూర్తి చేసి అవసరమైన మార్పులతో సినిమాను సిద్ధం చేయాలని చిత్ర బృందం భావిస్తున్నట్లు తెలుస్తోంది. సేనాపతి గతం, ఆయన తండ్రి పాత్ర చుట్టూ సాగే పీరియాడిక్ సన్నివేశాలు చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలవవచ్చని సమాచారం. అయితే, రీషూట్లకు ఎంత సమయం పడుతుంది, సినిమా ఎప్పుడు విడుదలవుతుంది అనే అంశాలపై ఇంకా స్పష్టత లేదు. వచ్చే సంక్రాంతికి విడుదల చేస్తారనే ప్రచారం ఉండగా, మార్చి లేదా ఏప్రిల్లో మళ్లీ చిత్రీకరణ జరగవచ్చనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. థియేటర్లలో విడుదల చేస్తే అదనపు ఖర్చులు ఎదురయ్యే అవకాశం ఉండగా, ఓటీటీ విడుదల నిర్ణయం కూడా అంత సులభం కాదని సినీ వర్గాలు భావిస్తున్నాయి. మరోవైపు, శంకర్ తన తదుపరి ప్రాజెక్ట్ ‘వేల్పారి’పై దృష్టి పెట్టాలనుకుంటున్న నేపథ్యంలో ‘ఇండియన్ 3’ విడుదల ఆయనకు కీలక సవాలుగా మారింది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!