

మహిళలపై జరుగుతున్న ఆన్లైన్ ట్రోలింగ్, లింగ వివక్ష, దుస్తులు మరియు శరీరాకృతిపై చేసే అనవసర వ్యాఖ్యలపై బాలీవుడ్ నటి కృతి సనన్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. కరీనా కపూర్ ఖాన్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ‘వాట్ విమెన్ వాంట్’ కార్యక్రమంలో పాల్గొన్న ఆమె, ఇటీవల ఓ రాఖీ ప్రకటనలో తాను ధరించిన దుస్తులపై చెలరేగిన వివాదం గురించి మాట్లాడారు. సాధారణంగా ట్రోలింగ్‌ను పట్టించుకోనని, విమర్శలు చేసేవారికి అనవసర ప్రాధాన్యం ఇవ్వడం తనకు ఇష్టం ఉండదని కృతి తెలిపారు. అయితే, ఆ ప్రకటనలోని తన దుస్తులపై ఆరుగురు పాల్గొన్న ప్రైమ్‌టైమ్ టీవీ చర్చ జరగడం చూసి ఆశ్చర్యపోయానని చెప్పారు. ఈ అంశం ఇంత పెద్ద చర్చకు దారితీస్తుందని ఊహించలేదని, అందుకే స్పందించాల్సి వచ్చిందని వివరించారు.
మహిళలు ఎలాంటి దుస్తులు ధరించాలనేది పూర్తిగా వారి వ్యక్తిగత నిర్ణయమని కృతి స్పష్టం చేశారు. మహిళలు లావుగా ఉన్నా, సన్నగా ఉన్నా, పొట్టిగా ఉన్నా వారి శరీరాకృతిపై వ్యాఖ్యలు చేయడం పెరిగిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. సోషల్ మీడియాలో ప్రతికూల వ్యాఖ్యలను నివారించేందుకు కామెంట్ సెక్షన్‌ను ఆఫ్ చేయాలని తన సోదరి సూచించినప్పటికీ, ఇతరుల విమర్శలకు భయపడి మహిళలు ఎందుకు వెనక్కి తగ్గాలని ప్రశ్నించినట్లు తెలిపారు. ఈ అభిప్రాయాలతో కరీనా కపూర్ ఏకీభవించారు. ఆహారపు అలవాట్ల వల్ల కనిపించే చిన్నపాటి శారీరక మార్పులకూ వివరణ ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడుతోందని ఆమె పేర్కొన్నారు. మహిళలపై జరుగుతున్న ట్రోలింగ్, బాడీ షేమింగ్‌ను కృతి ప్రశ్నించిన తీరును కరీనా అభినందించారు.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!