

దర్శకుడు కేఎస్ రవికుమార్ సూపర్‌స్టార్ రజనీకాంత్ నటించిన జైలర్-2 సినిమాను కుటుంబంతో కలిసి ఫీనిక్స్ మాల్‌లో వీక్షించారు. సినిమా ఫస్టాఫ్ సరదాగా సాగితే, సెకండాఫ్ మాస్ ఎలిమెంట్స్‌తో అదరగొట్టిందని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రస్తుత ప్రేక్షకుల అభిరుచులకు తగ్గట్టుగా రూపొందించిన పక్కా రజనీకాంత్ సినిమా ఇదని ప్రశంసించారు. రజనీ అభిమానులు ఈ చిత్రాన్ని మరింతగా ఆస్వాదిస్తారని చెప్పారు. తన అన్నయ్య కుమారుడు ఈ సినిమాను మూడు రోజుల్లో నాలుగుసార్లు చూశాడని వెల్లడించారు. సినిమాలో రజనీకాంత్ ఐకానిక్ టైటిల్ కార్డ్‌కు దేవా అందించిన సంగీతం ప్రత్యేక ఆకర్షణగా నిలిచిందని తెలిపారు. ముత్తు సినిమా కోసం కొత్త యానిమేటెడ్ టైటిల్ కార్డ్ రూపొందించేందుకు సమయం సరిపోకపోవడంతో బాషా టైటిల్ కార్డ్‌నే కొనసాగించామని, సంగీత బాధ్యతలు చేపట్టిన ఏఆర్ రెహమాన్ కూడా దేవా ట్యూన్‌ను అలాగే కొనసాగిస్తూ అదనపు సంగీత పొరలను జోడించారని వివరించారు.
జైలర్-3 ఎప్పుడు తెరకెక్కుతుందో తనకు తెలియదని కేఎస్ రవికుమార్ పేర్కొన్నారు. రజనీకాంత్, దర్శకుడు నెల్సన్ దిలీప్‌కుమార్ ఇద్దరికీ ప్రస్తుతం పలు కమిట్‌మెంట్లు ఉన్నాయని చెప్పారు. నెల్సన్ ప్రస్తుతం కమల్ హాసన్, రజనీకాంత్ కలిసి నటించనున్న కేహెచ్‌ఎక్స్‌ఆర్‌కే ప్రాజెక్ట్‌తో బిజీగా ఉన్నారని తెలిపారు. వారిద్దరూ తమ ప్రస్తుత ప్రాజెక్టులను పూర్తి చేసిన తర్వాత జైలర్-3 పట్టాలెక్కే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. మూడో భాగంలో పలువురు ప్రముఖ నటీనటులు కనిపించే అవకాశం ఉన్నప్పటికీ, సినిమా విజయం మాత్రం కథాంశం, సన్నివేశాల నాణ్యతపైనే ఆధారపడి ఉంటుందని కేఎస్ రవికుమార్ వ్యాఖ్యానించారు.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!