

యూట్యూబ్ పాటలతో గుర్తింపు తెచ్చుకుని ఇప్పుడు హీరోయిన్‌గా సినిమాల్లోకి అడుగుపెట్టిన నాగదుర్గ త్వరలో ‘ఇడుపు కాయితం’తో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రం డిసెంబర్ 11న విడుదల కానున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో నిర్వహించిన కార్యక్రమంలో ‘గడప’ పాటను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో నాగదుర్గ తన సినీ ప్రయాణం గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. మొదట్లో సినిమాల్లోకి రావాలనే ఆలోచన తనకు లేదని, అయితే ‘ఇడుపు కాయితం’ పూర్తి కథ విన్నాక, అందులోని శ్రీలత పాత్ర తన కోసమే ఉందనిపించిందని తెలిపారు. ఇప్పటికే విడుదలైన ‘శ్రీలత’ పాటకు మంచి స్పందన వచ్చినట్లు చిత్రబృందం వెల్లడించింది.
షూటింగ్ సమయంలో నటుడు ప్రియదర్శి తనను ఆటపట్టించిన సంఘటనలను కూడా నాగదుర్గ గుర్తుచేసుకున్నారు. తాను చిన్నపిల్లనని, జాగ్రత్తగా చూసుకోవాలని ముందుగానే చెప్పినప్పటికీ ప్రియదర్శి తనను బాగా ర్యాగింగ్ చేశారని సరదాగా తెలిపారు. ఈ విషయాన్ని నిర్మాత బన్నీ వాసుకు చెబుతానంటే, చెప్పుకోమంటూ ప్రియదర్శి బదులిచ్చారని వివరించారు. తన తండ్రి పోలీసు అధికారి కావడంతో కాలేజీలో ఎవరూ తనను ర్యాగింగ్ చేయలేదని, కానీ షూటింగ్‌లో ప్రియదర్శి మాత్రం ఆటపట్టించారని నవ్వుతూ చెప్పారు. ఇక ‘గడప’ పాటలో అచ్చమైన తెలంగాణ పదాలతో అత్తారింట్లోకి అడుగుపెట్టే కొత్త కోడలి భావోద్వేగాలను, ఆ వాతావరణాన్ని అందంగా చూపించినట్లు చిత్రబృందం పేర్కొంది.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!