

సినిమా పరిశ్రమ ఎంతో మందికి ఉపాధి, అవకాశాలు కల్పిస్తోందని, అలాంటి పరిశ్రమను అనవసరంగా ఇబ్బంది పెట్టడం సెన్సార్ బోర్డుకు తగదని ప్రముఖ నటుడు ఆర్. నారాయణమూర్తి అన్నారు. ఇబ్బందికర సన్నివేశాలు, సంభాషణలు ఉన్న కొన్ని సినిమాల విషయంలో సెన్సార్ బోర్డు చూసీచూడనట్లు వ్యవహరిస్తోందని, అదే సమయంలో అభ్యంతరకర అంశాలు లేని కొన్ని చిత్రాల విషయంలోనూ ఆంక్షలు విధించడం సరికాదని ఆయన వ్యాఖ్యానించారు. శ్రీవిష్ణు నటించిన ‘కామ్రేడ్ కళ్యాణ్’ టీజర్ విడుదల కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
‘కామ్రేడ్ కళ్యాణ్’ టైటిల్‌లోని ‘కామ్రేడ్’ పదంపై సెన్సార్ బోర్డు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నట్లు తెలిసిందని నారాయణమూర్తి పేర్కొన్నారు. సినిమా సమాజానికి అద్దంలా పనిచేసే అత్యంత ప్రభావవంతమైన మాధ్యమమని, ప్రజలకు వినోదంతో పాటు విజ్ఞానాన్ని అందిస్తుందని అన్నారు. కోట్ల రూపాయలు ఖర్చు చేసి సినిమాలు నిర్మించే నిర్మాతలను మానసికంగా ఇబ్బంది పెట్టడం సరికాదని, సినిమా భావప్రకటన స్వేచ్ఛలో భాగమని పేర్కొంటూ సెన్సార్ పెద్దలు సినిమాలను అనవసరంగా అడ్డుకోవద్దని విజ్ఞప్తి చేశారు.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!