

విశ్వక్ సేన్ కథానాయకుడిగా నటిస్తూ, స్వీయ దర్శకత్వంలో రూపొందించిన చిత్రం ‘కల్ట్’. సందీప్ కాకరాల నిర్మిస్తున్న ఈ సినిమాలో గాయత్రి భరద్వాజ్, తారక్ పొన్నప్ప, మురళీ శర్మ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ నెల 30న సినిమా థియేటర్లలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఆదివారం హైదరాబాద్‌లో చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు.
ఈ సందర్భంగా విశ్వక్ సేన్ మాట్లాడుతూ వరుసగా మూడు పరాజయాలు ఎదురైనప్పుడు ఒత్తిడి, ఆందోళనకు గురయ్యానని, తాను తప్పు దారిలో వెళ్తున్నానా అనే సందేహం కలిగిందని తెలిపారు. తన చేతిలోనే పరిష్కారం ఉందని అన్న గుర్తుచేయడంతో ‘ఫలక్‌నుమా దాస్’ సమయంలో తన కోసం తాను నిలబడినట్లే ఈ సినిమా బాధ్యతను కూడా తీసుకోవాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు. తొలుత తాజుద్దీన్‌ను దర్శకుడిగా అనుకున్నామని, ఆయనే తనకు నటనలో గురువని పేర్కొంటూ, దర్శకత్వ బాధ్యతలు స్వీకరించినందుకు క్షమాపణలు తెలిపారు. ఈ చిత్రంతో దాదాపు 150 మంది కొత్త నటీనటులు పరిచయం కానున్నారని, సినిమా మొదలైన ఐదు నిమిషాల్లోనే ప్రేక్షకులు ఓ కొత్త ప్రపంచంలోకి వెళ్తారని అన్నారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!