

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా, హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘ఫౌజీ’పై ప్రేక్షకుల్లో ఆసక్తి పెరుగుతోంది. మైత్రీ మూవీ మేకర్స్, టీ-సిరీస్ సంస్థలు నిర్మిస్తున్న ఈ సినిమాలో ఇమాన్వి కథానాయికగా నటిస్తున్నారు. ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా చిత్రబృందం విడుదల చేసిన ‘ఫైల్ నంబర్ 25’ గ్లింప్స్‌లో నేతాజీ సుభాష్ చంద్రబోస్, అడాల్ఫ్ హిట్లర్‌కు సంబంధించిన విజువల్స్ ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించాయి. నేతాజీ పాత్రలో కనిపించిన వ్యక్తి ఎవరో తెలుసుకోవాలనే ఆసక్తి నెలకొనగా, ఆ పాత్రను ప్రముఖ మరాఠీ నటుడు సుబోధ్ భవే పోషించినట్లు వెల్లడైంది. చారిత్రక వ్యక్తిని పోలిన ఆయన రూపం, ఆహార్యం గ్లింప్స్‌లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
సుబోధ్ భవే నటుడిగానే కాకుండా దర్శకుడిగా, నిర్మాతగా కూడా మరాఠీ చిత్ర పరిశ్రమలో గుర్తింపు సంపాదించారు. నాటక రంగంతో తన కెరీర్‌ను ప్రారంభించిన ఆయన, అనంతరం సినిమాలు, టెలివిజన్‌లోనూ రాణించారు. ‘కత్యర్ ఖల్జత్ గుసాలీ’ చిత్రంతో దర్శకుడిగా మారారు. గతంలో ‘లోక్‌మాన్య: ఏక్ యుగపురుష్’ సినిమాలో స్వాతంత్ర్య సమరయోధుడు బాలగంగాధర తిలక్ పాత్రను పోషించి ప్రశంసలు అందుకున్నారు. ఇప్పుడు ‘ఫౌజీ’లో నేతాజీ సుభాష్ చంద్రబోస్ పాత్రతో మరోసారి చారిత్రక వ్యక్తిని తెరపై ఆవిష్కరించనున్నారు. తన నటనకు మరాఠీ చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖులు, సన్నిహితుల నుంచి అభినందనలు అందాయని సుబోధ్ వెల్లడించారు.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!