

రణబీర్ కపూర్, యష్, సాయి పల్లవి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న రామాయణం: పార్ట్ వన్ ప్రపంచవ్యాప్తంగా 2026 నవంబర్ 5న థియేటర్లలో విడుదల కానుంది. నితేశ్ తివారీ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ భారీ పౌరాణిక చిత్రంపై ఇప్పటికే ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. తాజాగా ఈ సినిమా ఓటీటీ విడుదలకు సంబంధించి ఆసక్తికరమైన విషయం వెలుగులోకి వచ్చింది. భారతదేశంలో థియేటర్లలో ప్రదర్శన పూర్తయిన తర్వాత జియోహాట్‌స్టార్‌లో ఈ చిత్రాన్ని పే-పర్-వ్యూ విధానంలో అందించనున్నట్లు జియోస్టార్ ప్రకటించింది. ఈ విధానంలో సాధారణ ఓటీటీ సబ్‌స్క్రిప్షన్ ఉంటే సరిపోదు. సినిమాను చూడటానికి ప్రేక్షకులు అదనంగా డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది.
ఈ విధానం చిత్ర నిర్మాతలకు అదనపు ఆదాయాన్ని తెచ్చిపెడుతుందా అనే చర్చ మొదలైంది. భారత్‌లో పే-పర్-వ్యూ విధానానికి ఇప్పటివరకు పెద్దగా ఆదరణ లభించలేదు. చాలా మంది ప్రేక్షకులు ఒక్కో సినిమాకు ప్రత్యేకంగా చెల్లించడంకంటే, తమ సబ్‌స్క్రిప్షన్‌లో అందుబాటులో ఉన్న సినిమాలను చూడటానికే ఆసక్తి చూపుతున్నారు. రామాయణం: పార్ట్ వన్ కోసం ఎంత మొత్తం చెల్లించాల్సి ఉంటుందో, ఓటీటీలో ఎప్పుడు విడుదలవుతుందో చిత్రబృందం ఇంకా వెల్లడించలేదు. నమిత్ మల్హోత్రా, యష్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి హాన్స్ జిమ్మర్, ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. పలు భాషల్లో విడుదల కానున్న ఈ సినిమా థియేటర్ ప్రదర్శనకు అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభమైనట్లు సమాచారం. ఓటీటీలో అదనపు చెల్లింపుల విధానానికి ప్రేక్షకుల నుంచి ఎలాంటి స్పందన వస్తుందో వేచి చూడాలి.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!