

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ టర్కీ నుంచి అమెరికాకు తిరుగు ప్రయాణంలో రహస్యంగా విమానం మార్చిన ఘటన మరోసారి ఆసక్తిని రేకెత్తిస్తోంది. జూలై 8న అంకారాలో నాటో సదస్సు ముగించుకున్న అనంతరం భద్రతా కారణాలతో ట్రంప్‌ను ఎయిర్ ఫోర్స్ వన్ నుంచి మరో సైనిక విమానంలోకి రహస్యంగా తరలించినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. ట్రంప్ ఎయిర్ ఫోర్స్ వన్‌లోనే ప్రయాణిస్తున్నారనే భావన కలిగిస్తూ.. వాస్తవంగా ఆయన మరో విమానంలో ఉండేలా ఈ ‘డీకాయ్ ప్లేన్’ ఆపరేషన్ చేపట్టినట్లు కథనాలు పేర్కొన్నాయి. ఇరాన్ నుంచి ముప్పు ఉండొచ్చన్న హెచ్చరికల నేపథ్యంలో ఈ చర్యలు చేపట్టినట్లు సమాచారం. ట్రంప్‌ను ఒక విమానం నుంచి మరో విమానానికి క్యాటరింగ్ ట్రక్కులో తరలించినట్లు కూడా రిపోర్టులు వెల్లడించాయి. ఈ రహస్య బదిలీలో కొద్దిమంది అధికారులు మాత్రమే ఆయన వెంట ఉన్నట్లు తెలుస్తోంది.
టర్కీ నుంచి బయలుదేరిన సైనిక విమానం బ్రిటన్‌లోని రాయల్ ఎయిర్‌ఫోర్స్ మిల్డెన్‌హాల్ స్థావరానికి చేరుకున్న తర్వాత ట్రంప్ మరోసారి విమానం మార్చి అమెరికాకు వెళ్లినట్లు కథనాలు తెలిపాయి. ఈ వ్యవహారం వెలుగులోకి రావడంతో సోషల్ మీడియాలో అనేక ఊహాగానాలు, చర్చలు జరిగాయి. దీనిపై ట్రంప్ స్పందిస్తూ.. తనకు ముప్పులు ఉండటం సహజమేనని, తాను భయపడే వ్యక్తిని కాదని, అయితే సీక్రెట్ సర్వీస్, సైనిక అధికారులు సురక్షితమైన మార్గంగా సూచించడంతో వారి సలహాను పాటించినట్లు తెలిపారు. ఇప్పుడు ఈ రహస్య ప్రయాణం వెనుక జరిగిన పరిణామాలను Instadocs: The Decoy Plane పేరుతో నెట్‌ఫ్లిక్స్ డాక్యుమెంటరీగా తీసుకొస్తోంది. ఘటనను తొలిసారి రిపోర్ట్ చేసిన జర్నలిస్టులతో పాటు వైట్‌హౌస్, విమానయాన రంగం, మాజీ సీక్రెట్ సర్వీస్ సిబ్బంది ఇంటర్వ్యూలు ఇందులో ఉండనున్నాయి. సెప్టెంబర్ 4 నుంచి ఇది స్ట్రీమింగ్ కానుంది.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!