

భువనగిరి లోక్‌సభ సభ్యుడు చామల కిరణ్ కుమార్ రెడ్డి ఇరిగేషన్ శాఖ కార్యదర్శి శ్రీధర్‌కు లేఖ రాశారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఫామ్‌హౌస్‌కు కొండపోచమ్మ సాగర్ నుంచి నీటిని మళ్లించారనే ఆరోపణలపై సమగ్ర విచారణ జరపాలని కోరారు. ప్రజల అవసరాలు, వ్యవసాయ ప్రయోజనాల కోసం ఉద్దేశించిన లిఫ్ట్ ఇరిగేషన్ పథకాన్ని వ్యక్తిగత అవసరాలకు వినియోగించారనే ఆరోపణలపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయాలని లేఖలో పేర్కొన్నారు. ప్రాజెక్టు లక్ష్యాలకు అనుగుణంగానే నీటి సరఫరా జరిగిందా లేదా అనే విషయాన్ని అధికారులు పరిశీలించాలని కోరారు.
ప్రాజెక్టుకు సంబంధించిన రికార్డులను పూర్తిస్థాయిలో పరిశీలించి, ప్రజాధనం దుర్వినియోగం జరిగిందా? జరిగితే ఎంత మేరకు జరిగిందో నిర్ధారించాలని చామల కిరణ్ కుమార్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. కొండపోచమ్మ సాగర్ నుంచి పాండురంగ చెరువుకు, అక్కడి నుంచి కేసీఆర్ ఫామ్‌హౌస్‌కు నీటిని తరలించారనే ఆరోపణలపై వీలైనంత త్వరగా దర్యాప్తు పూర్తి చేయాలని కోరారు. విచారణలో బాధ్యులుగా తేలిన వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ ఆరోపణలకు సంబంధించిన వాస్తవాలు అధికారిక దర్యాప్తులో తేలాల్సి ఉంది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!