

హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్సీ ఎన్. రామచందర్రావును అభ్యర్థిగా నిలబెట్టే అంశాన్ని పార్టీ పరిశీలిస్తున్నట్లు సమాచారం. హైదరాబాద్లోని బీజేపీ కార్యాలయంలో మంగళవారం జరిగిన సమావేశంలో ఈ మూడు ఉమ్మడి జిల్లాలకు చెందిన పార్టీ నేతలతో త్రిసభ్య కమిటీ చర్చించి వారి అభిప్రాయాలను సేకరించింది. ఈ స్థానం నుంచి రామచందర్రావు పోటీ చేస్తే ఎలా ఉంటుందనే అంశంపై నాయకుల అభిప్రాయాలను తెలుసుకుంది. ఆయన 2009 నుంచి ఈ స్థానానికి పోటీ చేస్తుండగా, 2015లో విజయం సాధించారు. 2009, 2021 ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు.
మరోవైపు, వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి వెనుకబడిన తరగతులకు చెందిన అభ్యర్థిని ఎంపిక చేసే అవకాశాన్ని బీజేపీ పరిశీలిస్తోంది. ఈ రెండు స్థానాల కోసం వరుసగా 28, 10 మంది దరఖాస్తు చేసుకున్నట్లు సమాచారం. త్రిసభ్య కమిటీ ఒక్కో స్థానానికి ముగ్గురు అభ్యర్థుల పేర్లతో కూడిన జాబితాను, అభిప్రాయ సేకరణ నివేదికను బుధవారం రామచందర్రావుకు అందజేయనుంది. అనంతరం రాష్ట్ర పార్టీ చర్చించి, తుది పరిశీలన కోసం జాతీయ నాయకత్వానికి నివేదిక పంపనుంది. కాంగ్రెస్ ఇప్పటికే తన అభ్యర్థులను ప్రకటించడంతో బీజేపీ కూడా ఎంపిక ప్రక్రియను త్వరగా పూర్తి చేసేందుకు కసరత్తు చేస్తోంది.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!