

ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో రెబల్ అభ్యర్థుల విషయంలో టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక హెచ్చరిక చేశారు. పార్టీ నిర్ణయానికి వ్యతిరేకంగా బరిలో నిలిచే అభ్యర్థులపై సస్పెన్షన్ వేటు తప్పదని స్పష్టం చేశారు. స్థానిక ఎన్నికల ప్రచారం, ఎంపీటీసీ, జడ్పీటీసీ అభ్యర్థుల ఎంపిక తదితర అంశాలపై పార్టీ ముఖ్యనేతలతో నిర్వహించిన టెలికాన్ఫరెన్స్లో ఆయన ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు. రెబల్ అభ్యర్థులతో నామినేషన్లు ఉపసంహరింపజేయాలని, జనసేన, బీజేపీ అధికారిక అభ్యర్థులు పోటీలో ఉన్న చోట కూడా రెబల్స్ లేకుండా చూడాలని సూచించారు.
స్థానిక ఎన్నికల్లోనూ ప్రజల మద్దతు పొందేందుకు కూటమి నేతలు సమన్వయంతో పనిచేయాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. సార్వత్రిక ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్న తీరును ప్రజలకు వివరించాలని, సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలను ‘చెప్పాం.. చేస్తున్నాం’ అనే నినాదంతో ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. కూటమి పార్టీల మధ్య మిత్రధర్మాన్ని పాటిస్తూ క్షేత్రస్థాయిలో సీట్ల సర్దుబాటు సజావుగా జరిగేలా చూడాలని ఆదేశించారు. టికెట్లు దక్కని ఆశావహులకు నామినేటెడ్ పదవుల్లో అవకాశం కల్పిస్తామని పేర్కొంటూ, ప్రజలకు సేవ చేసే మంచి అభ్యర్థులను ఎంపిక చేయాలని నేతలకు దిశానిర్దేశం చేశారు.



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!