

హైదరాబాద్‌లోని బోధి పెవిలియన్‌లో ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఇరిగేషన్ ప్రాజెక్టులపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఇరిగేషన్ మంత్రి ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి, మంత్రులు జూపల్లి కృష్ణారావు, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్ రెడ్డి, ఇరిగేషన్ శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. తుమ్మిడిహెట్టి బ్యారేజీ, డిండి ప్రాజెక్టు, అచ్చంపేట ఎత్తిపోతల పథకాలపై ప్రధానంగా చర్చించారు. తుమ్మిడిహెట్టి బ్యారేజీ నిర్మాణంపై మహారాష్ట్ర ప్రభుత్వంతో త్వరలో చర్చలు జరిపేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు. అక్టోబర్ 23 తర్వాత చర్చలకు పిలుస్తానని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఇటీవల సూచనప్రాయంగా అంగీకరించినట్లు రేవంత్ రెడ్డి తెలిపారు. బ్యారేజీని 152 మీటర్ల ఎత్తులో నిర్మిస్తే ఎంత నీటిని వినియోగించుకోవచ్చు, మహారాష్ట్ర పరిధిలో ఎంత మేర ముంపు ఏర్పడవచ్చనే వివరాలను అధికారులు సమర్పించారు. అటవీ, గిరిజన, వెనుకబడిన ప్రాంతాలు అధికంగా ఉన్న ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో రెండు లక్షల ఎకరాలకు సాగునీరు అందించేలా బ్యారేజీ ఎత్తుపై ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సీఎం సూచించారు. మహారాష్ట్రతో చర్చలకు అవసరమైన నివేదికలతో పాటు ఢిల్లీలో ఇటీవల జరిగిన సమావేశాల వివరాలను కూడా సిద్ధంగా ఉంచాలని ఆదేశించారు.
డిండి ప్రాజెక్టుకు ఏదుల రిజర్వాయర్ నుంచి 0.5 టీఎంసీల నీటిని, అచ్చంపేట ఎత్తిపోతల పథకానికి 0.1 టీఎంసీల నీటిని కేటాయించాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు. ఇందుకోసం శ్రీశైలం, నార్లాపూర్ నుంచి అదనంగా 0.6 టీఎంసీల నీటిని ఏదుల వరకు తీసుకువచ్చేలా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ఈ చర్యలతో పాలమూరు ప్రాంతానికి నీటి సరఫరాలో ఇబ్బందులు తలెత్తకుండా చూడవచ్చని పేర్కొన్నారు. అవసరమైన పంప్‌హౌస్‌లు, పంపులు, ఇతర వ్యవస్థల నిర్మాణ పనులను వెంటనే ప్రారంభించాలని అధికారులకు స్పష్టం చేశారు.



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!