

తమిళ నటుడు ధనుష్ రాజకీయ రంగ ప్రవేశంపై తమిళనాడులో చర్చ జోరందుకుంది. ఆయన అభిమాన సంఘం పేరును “ధనుష్ నర్పణి ఇయక్కం”గా మార్చినట్లు వచ్చిన వార్తలు, ఇటీవల నిర్వహిస్తున్న సమావేశాలు, అభిమాన సంఘాల ద్వారా చేపడుతున్న సామాజిక కార్యక్రమాలు ఈ ఊహాగానాలకు మరింత బలాన్నిచ్చాయి. “తమిళగ ఎళుచ్చి కళగం” పేరుతో ధనుష్ కొత్త రాజకీయ పార్టీని ఎన్నికల సంఘంలో నమోదు చేశారనే ప్రచారం కూడా ఇటీవల వెలువడింది. అయితే, ఈ వార్తలపై ధనుష్ నుంచి అధికారిక ధ్రువీకరణ రాలేదు. రాజకీయాల్లోకి వస్తున్నట్లు ఆయన ఇప్పటివరకు ప్రకటించలేదు.
ఈ పరిణామాలపై నటుడు విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం (టీవీకే) సానుకూలంగా స్పందించింది. ధనుష్ రాజకీయాల్లోకి రావాలని నిర్ణయించుకుంటే స్వాగతిస్తామని పార్టీ అధికార ప్రతినిధి ఎం. సత్యకుమార్ తెలిపారు. విజయ్ తన సినీ కెరీర్‌ను పక్కనపెట్టి రాజకీయాలపై పూర్తిస్థాయిలో దృష్టి సారించారని, ఇందుకోసం దాదాపు 30 ఏళ్లపాటు కృషి చేశారని ఆయన గుర్తుచేశారు. రాజకీయ పార్టీని స్థాపించడం ఒక దశ మాత్రమేనని, దానిని బలోపేతం చేసి ఎన్నికల్లో విజయం సాధించడం మరో సవాలని పేర్కొన్నారు. రాజకీయాల్లోకి రావాలనుకునేవారు పూర్తిస్థాయిలో సమయం కేటాయించేందుకు సిద్ధంగా ఉండాలని సత్యకుమార్ అన్నారు. అయితే, ధనుష్ రాజకీయ భవిష్యత్తుపై స్పష్టత రావాలంటే ఆయన అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!