

తెలంగాణ ప్రభుత్వంలో ముదిరాజ్‌లను భాగస్వాములను చేసే బాధ్యత తనదేనని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. శుక్రవారం హైదరాబాద్‌లో నిర్వహించిన పండుగ సాయన్న జయంతి సభలో ఆయన పాల్గొని మాట్లాడారు. కొడంగల్ నియోజకవర్గంలో ముదిరాజ్‌ల జనాభా అధికంగా ఉందని, ఆ సామాజిక వర్గానికి చెందిన వారు విశ్వసనీయులని కొనియాడారు. సంక్షేమ పథకాల గురించి ప్రస్తావిస్తూ.. గతంలో ఎన్టీఆర్ కిలో బియ్యాన్ని రూ.2కే అందించారని, తమ ప్రభుత్వం సన్నబియ్యం పంపిణీ చేస్తోందని చెప్పారు. రాష్ట్రంలో 3.48 కోట్ల మందికి సన్నబియ్యం అందిస్తున్నామని వెల్లడించారు. ప్రభుత్వ పాలనలో ముదిరాజ్‌లకు తగిన భాగస్వామ్యం కల్పించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
పండుగ సాయన్న సేవలను గుర్తుచేసుకుంటూ సీఎం రేవంత్ రెడ్డి ఆయనను పేదల పక్షాన నిలిచిన పోరాట యోధుడిగా అభివర్ణించారు. నిజాం పాలనలో దొరలు పేదల భూములను ఆక్రమించుకునే సమయంలో సాయన్న వారికి అండగా నిలిచారని తెలిపారు. దొరల దోపిడీకి వ్యతిరేకంగా ఒక దళాన్ని ఏర్పాటు చేసి పేదల హక్కుల కోసం పోరాడారని పేర్కొన్నారు. ప్రజలకు ధాన్యం పంచడమే కాకుండా, పేద ఆడపిల్లల వివాహాలకు కూడా ఆర్థిక సాయం చేశారని కొనియాడారు. సాయన్నను నిజాం పోలీసులు అరెస్టు చేసినప్పుడు, అప్పటి వనపర్తి మహారాణి పెద్ద మొత్తంలో డబ్బు చెల్లించి ఆయనను విడిపించారని చెప్పే చారిత్రక కథనాన్ని కూడా సీఎం ప్రస్తావించారు. పేదల సంక్షేమం కోసం పండుగ సాయన్న చేసిన సేవలను ఈ సందర్భంగా గుర్తుచేశారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!