

తమిళనాడు పరిశ్రమల శాఖ మంత్రి కీర్తన తన విద్యాభ్యాసం, సామాజిక సేవ, రాజకీయ ప్రయాణానికి సంబంధించిన అనుభవాలను పంచుకున్నారు. విరుదునగర్‌లో తాను చదువుకున్న ప్రైవేటు పాఠశాలలో గురువారం నిర్వహించిన అభినందన కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్, ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు, పశ్చిమబెంగాల్ మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీలకు రాజకీయ సలహాదారుగా పనిచేసినట్లు తెలిపారు. డిగ్రీ పూర్తవగానే తనకు వివాహం చేయాలని కుటుంబ సభ్యులు భావించారని, అయితే లండన్‌లో ఉన్నత విద్య అభ్యసించాలనే తన ఆకాంక్షను తండ్రికి వివరించి ఆయన అంగీకారం పొందానని చెప్పారు. రాజకీయాల్లోకి రావాలని నిర్ణయించుకున్నప్పుడు కూడా తండ్రి తనకు అండగా నిలిచారని, పోస్టర్లు అతికించడంలో సహకరించారని గుర్తుచేసుకున్నారు. తల్లిదండ్రుల్లో నమ్మకం కలిగించి, వారి భయాలను తొలగించడం పిల్లల బాధ్యత అని పేర్కొన్నారు.
పుదుచ్చేరి సెంట్రల్ యూనివర్సిటీలో చేరినప్పుడు ఆంగ్లం, హిందీ భాషలు తెలియక ఇబ్బందులు ఎదుర్కొన్నానని కీర్తన తెలిపారు. ఇతర రాష్ట్రాల విద్యార్థులతో పరిచయం ద్వారా హిందీతో పాటు తెలుగు కూడా నేర్చుకున్నానని చెప్పారు. అనంతరం అంతర్జాతీయ సంస్థలో డేటా అనలిస్ట్‌గా నెలకు రూ.30 వేల వేతనంతో పనిచేశానని, మహిళల అభ్యున్నతి కోసం మహారాష్ట్రలోని మురికివాడల్లో సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నానని వివరించారు. ఆ అనుభవాలే రాజకీయాలపై ఆసక్తిని పెంచాయని, ప్రముఖ నాయకుల వద్ద రాజకీయ సలహాదారుగా పనిచేసిన అనుభవం రాజకీయాల్లోకి రావడానికి ధైర్యాన్నిచ్చిందని పేర్కొన్నారు. రాజకీయాల్లో రాణించడానికి డబ్బు, కుటుంబ నేపథ్యం కంటే మంచి ఉద్దేశం, ప్రజాసేవ ముఖ్యమని విద్యార్థినులకు సూచించారు. విరుదునగర్‌లో పాఠశాల విద్య, కళాశాల, ఆ తర్వాత వివాహం అనే సంప్రదాయ చక్రంలో మహిళలు చిక్కుకుపోకూడదని, తమ లక్ష్యాలను సాధించేందుకు ఆ పరిమితులను దాటి ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!