

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అల్లుడు, మాజీ సీనియర్ సలహాదారు జారెడ్ కుష్నర్‌కు సంబంధించిన ఫోన్ హ్యాకింగ్ వ్యవహారంపై వానిటీ ఫెయిర్ ప్రచురించిన పరిశోధనాత్మక కథనం అంతర్జాతీయంగా చర్చకు దారితీసింది. ఈ హ్యాకింగ్ ద్వారా సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) నేతలతో ముడిపడిన రహస్య ఆర్థిక, దౌత్య వ్యవహారాలు వెలుగులోకి వచ్చాయని కథనం ఆరోపించింది. 2017లో రష్యా సైనిక నిఘాకు సంబంధించిన సర్వర్‌ను పరిశీలించిన డచ్ నిఘా అధికారులు కుష్నర్ ఐఫోన్‌కు సంబంధించిన స్క్రీన్‌షాట్లను గుర్తించినట్లు పేర్కొంది. రష్యా హ్యాకర్ నుంచి లభించిన సమాచారాన్ని విశ్లేషించిన డచ్ మిలిటరీ ఇంటెలిజెన్స్ అండ్ సెక్యూరిటీ సర్వీస్ (ఎంఐవీడీ), యూఏఈలోని ఓ బ్యాంకు ఖాతాపై కుష్నర్‌కు నిర్వహణ అధికారం ఉన్నట్లు గుర్తించిందని తెలిపింది. అజర్‌బైజాన్‌లోని ఓ బ్యాంకు ద్వారా ఆ ఖాతాలోకి భారీ మొత్తంలో డబ్బు వచ్చినట్లు కథనం పేర్కొంది.
అమెరికా విదేశాంగ విధాన లక్ష్యాల కోసం ప్రత్యేక నిధిని ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనపై 2018లో చర్చలు జరిగినట్లు కూడా ఆ కథనం వెల్లడించింది. సౌదీ యువరాజు మహమ్మద్ బిన్ సల్మాన్, యూఏఈ నాయకత్వానికి చెందిన వ్యక్తులు ఈ ప్రతిపాదనలో భాగమైనట్లు పేర్కొంది. 10 బిలియన్ డాలర్లకు పైగా నిధులు సమీకరించాలనే ఆలోచన చర్చకు వచ్చినప్పటికీ, ఆ ప్రతిపాదన తర్వాత నిలిచిపోయిందని తెలిపింది. అనంతరం కుష్నర్‌కు సంబంధించిన రెండు ఖాతాల్లోకి 2 బిలియన్ డాలర్లకు పైగా జమ అయినట్లు ఆరోపించింది. అయితే, ఈ ఆరోపణలను కుష్నర్ తరఫు న్యాయవాది తీవ్రంగా ఖండించారు. అవి ఆధారాలు లేని కల్పిత కథనాలని పేర్కొంటూ, విదేశీ నేతలతో జరిగినట్లు చెబుతున్న వ్యవహారాలు అమెరికా అధ్యక్షుడి అనుమతి లేకుండా జరగలేదని స్పష్టం చేశారు. కథనాన్ని ప్రచురించిన వారిపై న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!