

తమిళనాడు అసెంబ్లీలో సీఎం విజయ్ చేసిన ఓ సంజ్ఞపై రాజకీయ వివాదం చెలరేగింది. సెప్టెంబర్ 7న అసెంబ్లీలో డీఎంకే పాలనలో జరిగినట్లు ఆరోపిస్తున్న అవినీతిపై విజయ్ తీవ్ర విమర్శలు చేశారు. ఈ సందర్భంగా ఆయన తన దవడను పైకెత్తినట్లు చేసిన సంజ్ఞను డీఎంకే నేతలు మాజీ ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ను ఉద్దేశించిన వ్యక్తిగత విమర్శగా భావించారు. దీంతో డీఎంకే నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. ఈ ఘటన బాడీ షేమింగ్ వివాదంగా మారింది. అయితే ఆ సంజ్ఞ ఉద్దేశపూర్వకంగా చేసింది కాదని, అనుకోకుండా జరిగిందని విజయ్ వివరణ ఇచ్చారు.
ఈ వివాదంపై ఎంకే స్టాలిన్ ఎక్స్ వేదికగా వీడియో సందేశాన్ని విడుదల చేసి విజయ్‌కు కౌంటర్ ఇచ్చారు. విజయ్‌ను ‘తమ్ముడూ విజయ్’ అంటూ సంబోధించిన స్టాలిన్.. 1975-77 మధ్య ఎమర్జెన్సీ సమయంలో తాను అనుభవించిన జైలు జీవితాన్ని గుర్తుచేసుకున్నారు. ఎమర్జెన్సీ సమయంలో తన తండ్రి ఎం. కరుణానిధి నేతృత్వంలోని డీఎంకే ప్రభుత్వం రద్దు కావడంతో, అప్పట్లో పార్టీ యువజన విభాగానికి నాయకత్వం వహిస్తున్న తనను అరెస్టు చేశారని తెలిపారు. జైలులో తీవ్ర చిత్రహింసలకు గురయ్యామని, పోలీసుల దాడిలో తన దవడ ఎముకలు విరిగిపోయాయని చెప్పారు. ఆ గాయాల గుర్తులు ఇప్పటికీ ఉన్నాయని పేర్కొన్నారు. తమిళనాడు, తమిళ ప్రజల కోసం పోరాడిన పలువురు రాజకీయ నాయకులు ఇలాంటి అణచివేతను ఎదుర్కొన్నారని స్టాలిన్ అన్నారు. పోరాటం చేయడం, దాని పర్యవసానాలను ఎదుర్కోవడం తమకు కొత్త కాదని పేర్కొంటూ.. తన రాజకీయ జీవితం, డీఎంకే చరిత్ర గురించి విజయ్ తెలుసుకోవాలని సూచించారు.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!