

ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి పార్టీలు ఉమ్మడి పత్రికా ప్రకటన విడుదల చేశాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, బీజేపీ ఏపీ అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ పేర్లతో విడుదలైన ఈ ప్రకటనలో రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్‌ఈసీ) తీసుకునే నిర్ణయాలకు కట్టుబడి ఉంటామని కూటమి నేతలు స్పష్టం చేశారు. 2024 ఎన్నికల్లో రాష్ట్ర పునర్నిర్మాణం నినాదంతో ప్రజల ముందుకు వెళ్లామని, ప్రజలు కూటమికి పాలనా బాధ్యతలు అప్పగించారని పేర్కొన్నారు. గత రెండేళ్లుగా సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలనకు ప్రాధాన్యమిస్తున్నామని తెలిపారు. స్థానిక సంస్థలు బలోపేతమైతేనే రాష్ట్ర సమగ్రాభివృద్ధి సాధ్యమని, నిర్ణీత గడువులోగా ఎన్నికలు నిర్వహించడం ద్వారా 16వ ఆర్థిక సంఘం, కేంద్ర ప్రభుత్వ నిధులు పొందేందుకు అవకాశం ఉంటుందని పేర్కొన్నారు.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రక్రియను అడ్డుకునేందుకు కోర్టుల్లో పిటిషన్లు వేయడంతో పాటు పలు ప్రాంతాల్లో హింసను ప్రేరేపిస్తోందని కూటమి నేతలు ఆరోపించారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా ప్రతిపక్షాలకు నామినేషన్లు వేయకుండా అడ్డంకులు సృష్టించారని, బలవంతపు ఏకగ్రీవాలు, ఎన్నికల అక్రమాలపై అప్పటి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ కేంద్రానికి లేఖ రాసిన విషయాన్ని గుర్తుచేశారు. ప్రస్తుత ఎన్నికలు పారదర్శకంగా, ప్రజాస్వామ్యబద్ధంగా, ప్రశాంతంగా జరగాలన్నదే తమ లక్ష్యమని స్పష్టం చేశారు. ఎన్నికల నిర్వహణలో ఎస్‌ఈసీకి సహకరిస్తామని, ఆ సంస్థ తీసుకునే నిర్ణయాలను గౌరవిస్తామని ప్రకటించారు. ప్రజలు తమకు నచ్చిన నాయకులను స్వేచ్ఛగా ఎన్నుకునేలా వాతావరణం కల్పించి, అభివృద్ధి ఫలాలు ప్రతి ఇంటికీ చేరాలన్నదే కూటమి ఉద్దేశమని తెలిపారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!