

నెల్లూరు జిల్లాలో పట్టణ, గ్రామీణ స్థానిక సంస్థల సాధారణ ఎన్నికలను స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి హిమాన్షు శుక్ల నోడల్ అధికారులను నియమించారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలు, శాంతిభద్రతల పరిరక్షణ, ఎన్నికల భద్రతా ప్రణాళిక, సిబ్బంది నియామకం, శిక్షణ, బ్యాలెట్ పేపర్ల ముద్రణ, పంపిణీ, రవాణా ఏర్పాట్లు, ఎన్నికల వ్యయ పర్యవేక్షణ, పరిశీలకులకు సమాచారం అందించడం వంటి కీలక బాధ్యతలను వారికి అప్పగించారు. మీడియా నిర్వహణ, కంప్యూటరీకరణ, వెబ్కాస్టింగ్, వీడియోగ్రఫీ, పోస్టల్ బ్యాలెట్లు, మైక్రో అబ్జర్వర్ల నియామకం, పోలింగ్ కేంద్రాల నిర్వహణ, బ్యాలెట్ బాక్సుల భద్రత, ఓటర్ల జాబితాల నిర్వహణ, ఎన్నికల ఫిర్యాదుల పరిష్కారం వంటి అంశాలకూ ప్రత్యేక అధికారులను నియమించారు.
నియమితులైన అధికారులు ఎన్నికలకు సంబంధించిన నిబంధనలు, విధివిధానాలపై పూర్తి అవగాహన పెంపొందించుకోవాలని కలెక్టర్ సూచించారు. తమకు కేటాయించిన బాధ్యతలను సకాలంలో పూర్తి చేసి, ఎలాంటి ఫిర్యాదులకు తావులేకుండా ఎన్నికలు నిర్వహించాలని ఆదేశించారు. విధుల్లో నిర్లక్ష్యం వహించినా, ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించినా తీవ్రంగా పరిగణిస్తామని హెచ్చరించారు. జిల్లా స్థాయి నోడల్ అధికారులకు అవసరమైన సిబ్బంది, సహకారం అందించాలని సంబంధిత మున్సిపల్ కమిషనర్లు, జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణాధికారి, జిల్లా పంచాయతీ అధికారులను ఆదేశించారు.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!