

ఆంధ్రప్రదేశ్‌లో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ సందర్భంగా చోటుచేసుకున్న హింసాత్మక ఘటనలపై డీజీపీ హరీశ్‌కుమార్ గుప్తా తీవ్రంగా స్పందించారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించినా, నామినేషన్ పత్రాలను చింపేసినా, పోలీసులపై దాడులకు పాల్పడినా ఎంతటి వారినీ ఉపేక్షించబోమని స్పష్టం చేశారు. రాజకీయ పార్టీలు, వ్యక్తుల హోదాలతో సంబంధం లేకుండా చట్టాన్ని కఠినంగా అమలు చేస్తామని తెలిపారు. నామినేషన్ల ప్రక్రియ తొలిరోజు రాష్ట్రంలోని 13 జిల్లాల్లో మొత్తం 31 ఘటనలు నమోదైనట్లు డీజీపీ కార్యాలయం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. వీటిలో 22 ఘర్షణలు, శాంతిభద్రతలకు విఘాతం కలిగించిన ఘటనలు కాగా, మరో తొమ్మిది చోట్ల నామినేషన్ పత్రాలను బలవంతంగా లాక్కొని చింపేసినట్లు వెల్లడించింది.
కనీసం ఆరు చోట్ల రాళ్లు, కర్రలతో దాడులు జరగగా, రెండు కార్లు, రెండు ద్విచక్ర వాహనాలు దగ్ధమైనట్లు డీజీపీ కార్యాలయం తెలిపింది. రెండు నివాస గృహాలపై దాడులు జరగడంతో పాటు, ఒక ఇంటిని జేసీబీతో కూల్చివేసిన ఘటన కూడా చోటుచేసుకుంది. అభ్యర్థులకు రక్షణగా వెళ్తున్న పోలీసు వాహనంపై రాళ్లదాడి జరిగినట్లు వెల్లడించింది. ఈ ఘటనలకు సంబంధించి ఇప్పటివరకు 16 కేసులు నమోదు చేయగా, మరో 11 ఘటనల్లో కేసుల నమోదు ప్రక్రియ కొనసాగుతోందని పేర్కొంది. సీసీటీవీ ఫుటేజీలు, వీడియోలను పరిశీలించి మరిన్ని అరెస్టులు చేసే అవకాశం ఉందని తెలిపింది. శాంతిభద్రతల పరిరక్షణలో రాజీపడబోమని, నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని డీజీపీ హెచ్చరించారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!