

రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని జనసేన పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పార్టీని సంస్థాగతంగా మరింత బలోపేతం చేసేందుకు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా 25 పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలో ప్రత్యేక అడ్‌హాక్ కమిటీలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. క్షేత్రస్థాయిలో పార్టీ పరిస్థితిని అంచనా వేయడం, అవసరమైన సమాచారాన్ని సేకరించడం, ఎన్నికల సన్నద్ధతను సమీక్షించడం ఈ కమిటీల ప్రధాన లక్ష్యాలుగా ఉండనున్నాయి. ఈ కమిటీలు పవన్ కల్యాణ్ స్వీయ పర్యవేక్షణలో పనిచేయనున్నాయి. త్వరలోనే కమిటీ సభ్యులతో సమావేశమై వారికి దిశానిర్దేశం చేయాలని ఆయన భావిస్తున్నారు.
స్థానిక ఎన్నికల నిర్వహణను మరింత సమర్థంగా చేపట్టేందుకు మరో నాలుగు కేంద్ర కమిటీలను కూడా నియమించాలని జనసేన నిర్ణయించింది. ఎన్నికల నిర్వహణ, మార్గదర్శకత్వం కోసం ఒక కమిటీతో పాటు కూటమి సమన్వయం, ప్రచారం, ట్రెజరీ వ్యవహారాల కోసం ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేయనున్నారు. విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గం మినహా మిగతా పార్లమెంట్ కమిటీలను ప్రకటించాలని నిర్ణయించినట్లు పార్టీ వెల్లడించింది. రాబోయే రోజుల్లో ప్రతి పార్లమెంట్ కమిటీతో పవన్ కల్యాణ్ సమావేశమై ఎన్నికల వ్యూహాలు, పార్టీ బలోపేతానికి సంబంధించిన అంశాలపై చర్చించనున్నారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!