

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రివర్గ సభ్యులు, కాంగ్రెస్ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ ముఖ్య నేతలతో ప్రత్యేక సమావేశం నిర్వహించేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. ప్రగతి భవన్లో జరగనున్న ఈ భేటీకి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్, జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు కూడా హాజరయ్యే అవకాశం ఉంది. రాష్ట్రంలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, జాతీయ స్థాయిలో కాంగ్రెస్ చేపడుతున్న కార్యక్రమాలు, పార్టీ నేతల మధ్య సమన్వయం వంటి అంశాలపై చర్చించనున్నట్లు తెలుస్తోంది.
నవంబరు 1న ఢిల్లీలో ఎస్ఐఆర్కు వ్యతిరేకంగా ఇండియా కూటమి నిర్వహించనున్న ర్యాలీ ఈ సమావేశంలో ప్రధాన అజెండాగా ఉండనుంది. ఈ కార్యక్రమంలో తెలంగాణకు చెందిన కాంగ్రెస్ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర ముఖ్య నేతల భాగస్వామ్యంపై సీఎం దిశానిర్దేశం చేయనున్నట్లు సమాచారం. మార్చిలో జరగనున్న రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించిన సన్నాహాలు, నవంబరు 6తో ముగియనున్న ఓటరు నమోదు ప్రక్రియను వేగవంతం చేయడంపైనా చర్చించనున్నారు. ఈ రెండు నియోజకవర్గాల పరిధిలోని ఆరు ఉమ్మడి జిల్లాల నేతలకు ఓటరు నమోదు కోసం కార్యాచరణ ప్రణాళిక రూపొందించనున్నట్లు తెలుస్తోంది. అదే సమయంలో రాష్ట్రంలో ఎల్నినో ప్రభావం ఎక్కువగా ఉండే ప్రాంతాలను గుర్తించి, ముందస్తు జాగ్రత్త చర్యలపై కూడా సమీక్షించే అవకాశం ఉంది.



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!