

రాజకీయాలే ప్రజల తలరాతలను మారుస్తాయని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ వైసీపీ అధినేత జగన్‌పై విమర్శలు గుప్పించారు. ఎన్నికల కమిషన్ వద్దకు సొంత మీడియాను తీసుకెళ్లి ప్రత్యక్ష ప్రసారాలు చేశారని ఆరోపించారు. వైసీపీ హయాంలో ఎన్ని స్థానాలు ఏకగ్రీవమయ్యాయో తెలుసుకోవాలని అన్నారు. అధికారులను బెదిరించి పనులు చేయించుకున్నారని, చివరకు వారినే జైలుకు పంపారని విమర్శించారు. పారిశ్రామికవేత్తలు కూడా జైలుకు వెళ్లాల్సి వచ్చిందని పేర్కొన్నారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన అరాచకాలు ప్రజలకు తెలుసని, ప్రజాస్వామ్యం గురించి మాట్లాడే ముందు వాటిని గుర్తు చేసుకోవాలని అన్నారు.
స్థానిక ఎన్నికల్లో మహిళలు, యువతకు ప్రాధాన్యం ఇచ్చామని చంద్రబాబు తెలిపారు. ప్రజాభిప్రాయ సేకరణతో పాటు ఐవీఆర్‌ఎస్ కాల్స్ ద్వారా అభిప్రాయాలు తెలుసుకుని అభ్యర్థులను ఎంపిక చేశామని చెప్పారు. బ్లాక్‌మెయిల్ రాజకీయాలకు అడ్డుకట్ట వేయడానికే మేయర్, చైర్మన్ పదవులకు ప్రత్యక్ష ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు వివరించారు. పులివెందుల, పుంగనూరు సహా పలు ప్రాంతాల్లో వైసీపీ నేతలు దాడులు, దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. కత్తులు, రాడ్లు, రౌడీయిజంతో రాజకీయాలు చేయాలని చూస్తే సహించబోమని హెచ్చరించారు. ప్రజలు ఆలోచించి స్థానిక ఎన్నికల్లో టీడీపీకి ఓటు వేసి మద్దతు ఇవ్వాలని కోరారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!