

ఆంధ్రప్రదేశ్‌లో ఎంపీటీసీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతున్న వేళ పలుచోట్ల ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పల్నాడు జిల్లా రొంపిచర్లలో నరసరావుపేట మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి సుమారు 300 మందితో నామినేషన్ కేంద్రానికి చేరుకున్నారు. 144 సెక్షన్ అమల్లో ఉన్నందున అంతమందికి అనుమతి లేదని పోలీసులు అడ్డుకోవడంతో వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ క్రమంలో వైకాపా నేతలు పోలీసులపై దాడికి దిగినట్లు సమాచారం. ఘటనలో నరసరావుపేట గ్రామీణ సీఐ గాయపడగా, పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు వైకాపా కార్యకర్తలపై లాఠీఛార్జ్ చేశారు.
మరోవైపు, కాకినాడ జిల్లా తొండంగిలో మాజీ మంత్రి దాడిశెట్టి రాజా పార్టీ అభ్యర్థులతో కలిసి నామినేషన్ కేంద్రానికి రావడంతో ఉద్రిక్తత నెలకొంది. 144 సెక్షన్ అమల్లో ఉందని పోలీసులు చెప్పడంతో వైకాపా నాయకులు వారితో వాగ్వాదానికి దిగారు. అనంతరం తెదేపా, వైకాపా వర్గీయుల మధ్య తోపులాట జరిగింది. అన్నమయ్య జిల్లా పుంగనూరు నియోజకవర్గంలోని సుదుం నామినేషన్ కేంద్రం వద్ద కూడా ఇరు పార్టీల కార్యకర్తలు పరస్పరం దాడులకు పాల్పడినట్లు సమాచారం. ఈ ఘటనలో తెదేపా నేత పవన్‌కుమార్ రెడ్డికి చెందిన కారుకు గుర్తుతెలియని వ్యక్తులు నిప్పు పెట్టారు.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!