

బీజేపీ గోవాను తన ‘పిగ్గీ బ్యాంక్’గా మార్చుకుందని లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ విమర్శించారు. గోవాలోని మడ్గావ్లో జరిగిన ‘గోయ్ రాఖోణ్ యాత్ర’ ముగింపు సభలో రాహుల్ ప్రసంగించారు. ఈ సందర్భంగా బీజేపీ ప్రభుత్వంపై, ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాలపై ఆయన తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. దేశంలో ఎన్నికల అక్రమాలు ఎలా జరుగుతున్నాయో ప్రజలందరికీ స్పష్టంగా తెలుసని రాహుల్ అన్నారు. ముఖ్య ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ ఓట్ల తొలగింపు, అక్రమాలను అమలు చేస్తుంటే, అమిత్ షా దాన్ని నడిపిస్తున్నారు, నరేంద్ర మోదీ వెనుక ఉండి ప్లాన్ చేస్తున్నారు అని ఆరోపించారు.
గోవా ప్రజల ఆస్తులు, భూములను స్థానిక రైతులు, పేదల నుంచి లాక్కుని ధనవంతులకు విక్రయిస్తున్నారని విమర్శించారు. గోవా అనేది ముఖ్యమంత్రి సొంత ఆస్తి కాదని, ఇది ఇక్కడి ప్రజలదని పేర్కొంటూ.. బీజేపీ నేతలు గోవాను అవినీతికి కేంద్రంగా, తమ సొంత పిగ్గీ బ్యాంక్గా మార్చుకున్నారని మండిపడ్డారు.గోవాలో దేశంలోనే అత్యధిక నిరుద్యోగిత నమోదవుతోందని, ఇక్కడి యువతకు భవిష్యత్తు లేక విదేశాలకు వలస వెళ్లాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఒకవైపు సాధారణ ప్రజలు ఇబ్బంది పడుతుంటే, బీజేపీ నేతలు, ముఖ్యమంత్రి కుటుంబ ఆస్తులు విపరీతంగా పెరుగుతున్నాయని ఆరోపించారు.
ఎయిర్పోర్టులు, రహదారులు, విద్యుత్ ప్లాంట్లు, రక్షణ రంగానికి సంబంధించిన కాంట్రాక్టులన్నింటినీ గౌతమ్ అదానీ, ముకేష్ అంబానీ వంటి పారిశ్రామికవేత్తలకు కట్టబెడుతున్నారని విమర్శించారు.దేశంలో బీజేపీ తిరుగులేని శక్తి అనే భావన, '56 ఇంచుల ఛాతీ' ప్రచారాలు ఇప్పుడు పటాపంచలయ్యాయని, దేశ యువత వారి అసలు రూపాన్ని గుర్తించిందని రాహుల్ గాంధీ స్పష్టం చేశారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!