

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విశాఖపట్నం, విజయనగరం నగరాల మేయర్ అభ్యర్థులను ఖరారు చేసింది. విశాఖపట్నం మేయర్ పదవికి ఎమ్మెల్సీ వరుదు కళ్యాణిని ఎంపిక చేయగా, విజయనగరం నుంచి కోలగట్ల శ్రావణిని బరిలోకి దించనుంది. ఆమె మాజీ ఎమ్మెల్యే, మంత్రి కోలగట్ల వీరభద్రస్వామి కుమార్తె. గతంలో కార్పొరేటర్గా ఎన్నికైన శ్రావణి, విజయనగరం డిప్యూటీ మేయర్గా కూడా పనిచేశారు. వరుదు కళ్యాణి 2021లో ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. ప్రస్తుతం వైఎస్సార్సీపీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలిగా ఉన్న ఆమె పదవీకాలం వచ్చే ఏడాది ముగియనుంది.
మరోవైపు, కడప జిల్లాలోని పలు మున్సిపల్ పదవులకు కూడా వైఎస్సార్సీపీ అభ్యర్థులను ప్రకటించింది. కడప మేయర్ పదవికి బండి దీప్తిని, పులివెందుల మున్సిపల్ చైర్పర్సన్ పదవికి వై.ఎస్. ప్రమీలమ్మను, కమలాపురం చైర్పర్సన్ పదవికి మరుజొల్ల కవితను ఎంపిక చేసింది. ప్రొద్దుటూరు చైర్పర్సన్ పదవికి పోరెడ్డి నరసింహారెడ్డి అభ్యర్థిత్వం దాదాపు ఖరారైనప్పటికీ అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. కర్నూలు, నంద్యాల జిల్లాలకు సంబంధించి పార్టీ ఇంకా అభ్యర్థులను ప్రకటించలేదు. అక్టోబర్ 16న నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. నామినేషన్ల దాఖలుకు అక్టోబర్ 18 చివరి తేదీగా నిర్ణయించారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!