

ప్రభుత్వంపై బురదజల్లే రాజకీయాలను వైకాపా నాయకులు ఇకనైనా మానుకోవాలని పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర హితవు పలికారు. ఓటమి భయంతోనే వైకాపా నేతలు అరాచకాలకు పాల్పడుతున్నారని ఆయన విమర్శించారు. పోలింగ్ కేంద్రాల వద్ద వీధి గూండాల మాదిరిగా వ్యవహరిస్తూ దాడులకు దిగుతున్నారని ఆరోపించారు. వైకాపా నేతలు చేస్తున్న దౌర్జన్యాలను తమపై నెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని ధూళిపాళ్ల నరేంద్ర అన్నారు. అలాంటి చర్యలను అడ్డుకోవడం తమకు పెద్ద కష్టమేమీ కాదని, అయితే అది తమ పద్ధతి కాదని పేర్కొన్నారు. పోలీసులు అడ్డుకుంటే వారిపైనా రాళ్లతో దాడులు చేస్తారా? అని ప్రశ్నించారు.
ఐదు చోట్ల జరిగిన ఘటనలను చూపిస్తూ రాష్ట్రవ్యాప్తంగా అలాంటి పరిస్థితులే ఉన్నట్లు చిత్రీకరించడం సరికాదని ధూళిపాళ్ల నరేంద్ర అన్నారు. తెలుగుదేశం పార్టీ తరఫున నామినేషన్లు వేయడానికి వచ్చే అభ్యర్థులను అడ్డుకోవడాన్ని ఏమనాలని ప్రశ్నించారు. రాష్ట్రంలో అద్భుతమైన అభివృద్ధి చేశామని జగన్ పదేపదే చెబుతున్నారని, అదే నిజమైతే ప్రజలు వైకాపాకు 11 సీట్లే ఎందుకు ఇచ్చారని వ్యాఖ్యానించారు. గతంలో ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ను జగన్ వేధించారని, రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న కమిషనర్ కుటుంబాన్ని బెదిరించారని ఆరోపించారు. గత స్థానిక ఎన్నికల సమయంలోనూ అరాచకాలు చోటుచేసుకున్నాయని విమర్శించారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరగాలని తాము కోరుకుంటున్నామని, ప్రభుత్వంపై నిరాధార ఆరోపణలు చేసే రాజకీయాలను వైకాపా మానుకోవాలని ధూళిపాళ్ల నరేంద్ర సూచించారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!