

బిగ్‌బాస్ తెలుగు సీజన్ 10 మరో మూడు రోజుల్లో ప్రారంభం కానుండటంతో ఈసారి హౌస్‌లోకి అడుగుపెట్టే సెలబ్రిటీలపై ఆసక్తి పెరిగింది. ఇప్పటికే ‘అగ్నిపరీక్ష’ ద్వారా నలుగురు సామాన్యులను ఎంపిక చేసినట్లు సమాచారం. సెలబ్రిటీల జాబితాలో సీరియల్ నటీమణులు పల్లవి గౌడ, తేజస్విని, కావ్యశ్రీ, కమెడియన్ ఎక్స్‌ప్రెస్ హరి, ఆటో రామ్ ప్రసాద్, నూకరాజు, రాకింగ్ రాకేశ్, డ్యాన్సర్ ఆట సందీప్ భార్య జ్యోతి, యూట్యూబర్ నందూ, టెంపర్ వంశీ తదితరుల పేర్లు వినిపిస్తున్నాయి.
తాజాగా ఈ జాబితాలో నటుడు కృష్ణుడు పేరు కూడా వినిపిస్తోంది. ఆయన సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫొటోల కింద పలువురు ‘బిగ్‌బాస్‌లో ధైర్యంగా ఉండు...సపోర్ట్ చేస్తాం’ అంటూ కామెంట్లు చేయగా, కృష్ణుడు వాటికి స్పందించడం ఆసక్తికరంగా మారింది. దీంతో ఆయన బిగ్‌బాస్ తెలుగు సీజన్ 10లో పాల్గొనడం దాదాపు ఖరారైనట్లు ప్రచారం జరుగుతోంది. 2005లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా సినీ రంగంలోకి వచ్చిన కృష్ణుడు ‘హ్యాపీ డేస్’తో గుర్తింపు తెచ్చుకున్నారు. ‘వినాయకుడు’, ‘విలేజ్‌లో వినాయకుడు’ చిత్రాలతో హీరోగానూ విజయాలు అందుకున్నారు. 2019 నుంచి కొంతకాలం సినిమాలకు దూరంగా ఉన్న ఆయన 2024 నుంచి అడపాదడపా సినిమాల్లో కనిపిస్తున్నారు. ఇటీవల ‘లగ్గం’, ‘గేమ్ ఛేంజర్’, ‘షణ్ముఖ’, ‘బ్యాడ్ బాయ్ కార్తీక్’ వంటి చిత్రాల్లో నటించారు. గతంలో ఆయన వైసీపీ పార్టీలో చేరిన విషయం తెలిసిందే.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!