

నటి ఇనయా సుల్తానా ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత, వృత్తిపరమైన జీవితానికి సంబంధించిన పలు విషయాలను వెల్లడించారు. సినీ పరిశ్రమలో అవకాశాల కోసం ఎదుర్కొన్న ఇబ్బందులు, స్వయంగా వెళ్లి అవకాశాలు అడిగిన సందర్భాలను ఆమె గుర్తుచేసుకున్నారు. కెరీర్‌లో కష్టమైన దశలో చిన్న పాత్రలు చేయడానికి కూడా సిద్ధపడ్డానని తెలిపారు. తన మాజీ ప్రియుడి అసూయ తమ బ్రేకప్‌కు ప్రధాన కారణాల్లో ఒకటని వెల్లడించారు. ఓ వివాహ వేడుకలో తనను అందరి ముందూ దుర్భాషలాడిన ఘటన తర్వాత ఆ సంబంధానికి ముగింపు పలికినట్లు ఇనయా తెలిపారు.
సోషల్ మీడియాలో వ్యక్తిగత విషయాలు ఎక్కువగా పంచుకుంటే దిష్టి తగులుతుందని తాను బలంగా నమ్ముతానని ఇనయా చెప్పారు. అందుకే ఇటీవల ఫోటోషూట్‌లు, వ్యక్తిగత విషయాలను సోషల్ మీడియాలో పంచుకోవడం తగ్గించానని తెలిపారు. తన రాబోయే సినిమాల వివరాలను కూడా ముందుగానే వెల్లడించడం లేదని చెప్పారు. దుబాయ్, బ్యాంకాక్, శ్రీలంక, సింగపూర్/మలేషియా వంటి దేశాలకు వెళ్లినట్లు వెల్లడించిన ఆమె, దుబాయ్ పర్యటనలు రియల్ ఎస్టేట్ గురించి తెలుసుకునేందుకేనని చెప్పారు. సినీ పరిశ్రమలో స్థిరమైన ఆదాయం లేకపోవడంతో ప్రత్యామ్నాయంగా రియల్ ఎస్టేట్ వైపు దృష్టి సారించినట్లు తెలిపారు. ఇక బిగ్‌బాస్ తర్వాత తన జీవితంలో పెద్దగా మార్పు రాలేదని, పేరు వచ్చినప్పటికీ సినిమా అవకాశాలు పెరగలేదని అన్నారు. పైగా తన పారితోషికం తగ్గిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటివరకు 11 సినిమాల్లో నటించానని, మరో మూడు సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. ప్రస్తుతం ప్రేమ సంబంధాలు, వివాహంపై ఆసక్తి లేదని, మరో పదేళ్ల తర్వాతే ఆ విషయాల గురించి ఆలోచిస్తానని ఇనయా పేర్కొన్నారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!