

పారా ఆసియా క్రీడల్లో భారత అథ్లెట్లు అద్భుత ప్రదర్శన కొనసాగిస్తున్నారు. పోటీల నాలుగో రోజు భారత్ ఏడు స్వర్ణాలు, ఐదు రజతాలతో కలిపి మొత్తం 26 పతకాలు సాధించింది. దీంతో భారత్ ఖాతాలోని మొత్తం పతకాల సంఖ్య 88కు చేరగా, పతకాల పట్టికలో నాలుగో స్థానంలో కొనసాగుతోంది. అథ్లెటిక్స్‌లో భారత క్రీడాకారులు అత్యధికంగా 52 పతకాలు సాధించారు. పురుషుల హైజంప్ టీ63 విభాగంలో శైలేశ్ కుమార్ 1.89 మీటర్లతో క్రీడల రికార్డు నెలకొల్పి స్వర్ణం గెలిచాడు. వరుణ్ భాటి రజతం, రాహుల్ కాంస్యం సాధించారు. 100 మీటర్ల పరుగులో విజయం సాధించిన దిలీప్ గవిత్, 400 మీటర్ల టీ47 విభాగంలోనూ 48.27 సెకన్లలో లక్ష్యాన్ని చేరుకుని రెండో స్వర్ణాన్ని అందుకున్నాడు. మహిళల 400 మీటర్ల టీ47లో అంజనాబెన్ బూంబాడియా పసిడి సాధించగా, పురుషుల లాంగ్‌జంప్‌లో ధర్మరాజ్ సొలైరాజ్ 7.15 మీటర్ల ఆసియా రికార్డు ప్రదర్శనతో స్వర్ణం గెలిచాడు. మహిళల డిస్కస్ త్రో ఎఫ్54 విభాగంలో సువర్ణ రాజ్ 15.66 మీటర్ల త్రోతో అగ్రస్థానంలో నిలిచింది.
ఆర్చరీలో శీతల్ దేవి ఒకే రోజు రెండు స్వర్ణ పతకాలు సాధించి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. మహిళల కాంపౌండ్ వ్యక్తిగత ఫైనల్లో సింగపూర్‌కు చెందిన అలిమ్ నూర్ స్యాహిదాపై 142-139తో విజయం సాధించింది. అంతకుముందు మిక్స్‌డ్ టీమ్ ఫైనల్లో పాయల్ నాగ్, తోమన్ కుమార్, శ్యామ్‌సుందర్‌లతో కలిసి ఇండోనేసియా జట్టును 151-148తో ఓడించి పసిడి అందుకుంది. గతంలో మహిళల టీమ్ విభాగంలో రజతం గెలిచిన శీతల్‌కు ఈ క్రీడల్లో ఇది మూడో పతకం. డబ్ల్యూ1 విభాగంలో పతకం సాధించిన తొలి భారత ఆర్చర్‌గా స్వాతి గుర్తింపు పొందింది. ఫైనల్లో చైనాకు చెందిన సెన్ మెంగ్‌కన్ చేతిలో 4-6తో ఓడిపోయి రజతం దక్కించుకుంది. మరోవైపు ఆంధ్రప్రదేశ్‌కు చెందిన స్విమ్మర్ రవికార్తీక్ పురుషుల 50 మీటర్ల ఫ్రీస్టైల్ ఎస్13 విభాగంలో కాంస్యం సాధించి తన పతకాల సంఖ్యను మూడుకు పెంచుకున్నాడు. అంతకుముందు అతడు రెండు రజతాలు గెలిచాడు. ఆంధ్రప్రదేశ్‌కే చెందిన రవని వలసనైని మహిళల 400 మీటర్ల టీ11 పరుగులో కాంస్యం సాధించింది. గతంలో 1,500 మీటర్ల టీ11 విభాగంలోనూ ఆమె కాంస్యం గెలిచింది. పోటీలు మరో రెండు రోజులు కొనసాగనున్న నేపథ్యంలో భారత్ పతకాల సెంచరీపై ఆశలు పెరుగుతున్నాయి.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!