

ప్రపంచంలోనే అత్యంత సంపన్నమైన క్రికెట్ బోర్డుగా పేరున్న బీసీసీఐలో సెలక్టర్ పదవుల కోసం ఈసారి ఆశించిన స్థాయిలో దరఖాస్తులు రాలేదని సమాచారం. నాలుగేళ్లపాటు చీఫ్ సెలక్టర్‌గా పనిచేసిన అజిత్ అగార్కర్ పదవీకాలం అక్టోబర్ 4తో ముగియడంతో, వెస్ట్‌జోన్ సెలక్టర్ పదవికి బీసీసీఐ దరఖాస్తులను ఆహ్వానించింది. అక్టోబర్ 14 సాయంత్రం 5 గంటలకు గడువు ముగియగా, మాజీ భారత క్రికెటర్లు రమేశ్ పొవార్, సమీర్ దిఘే మాత్రమే దరఖాస్తు చేసుకున్నట్లు కథనాలు వెల్లడించాయి. ఈ పదవికి పోటీ పడతారని భావించిన పార్థివ్ పటేల్ దరఖాస్తు చేయలేదు. వందకుపైగా టెస్టులు ఆడిన అనుభవమున్న ఇద్దరు మాజీ క్రికెటర్లు కూడా ఈ బాధ్యతలను స్వీకరించేందుకు ఆసక్తి చూపలేదని వార్తలు వస్తున్నాయి. అయితే, ఈ విషయాలపై బీసీసీఐ అధికారికంగా పూర్తి వివరాలు వెల్లడించాల్సి ఉంది.
మరోవైపు, 2026–27 ఆర్థిక సంవత్సరానికి సెలక్షన్ కమిటీ బడ్జెట్‌ను బీసీసీఐ రూ.17.45 కోట్ల నుంచి రూ.19.35 కోట్లకు పెంచినట్లు సమాచారం. చీఫ్ సెలక్టర్‌కు ఏడాదికి రూ.3 కోట్ల వరకు వేతనం లభించే అవకాశం ఉంది. దేశవాళీ, అంతర్జాతీయ క్రికెట్లో ఆటగాళ్ల ప్రదర్శనను అంచనా వేయడం, మ్యాచ్‌లను ప్రత్యక్షంగా వీక్షించడం, ఎంపిక సమావేశాలకు హాజరవడం, ప్రతి మూడు నెలలకోసారి బీసీసీఐ అపెక్స్ కౌన్సిల్‌కు నివేదికలు సమర్పించడం వంటి బాధ్యతలు సెలక్టర్లపై ఉంటాయి. జట్టు కెప్టెన్ల ఎంపికలోనూ సెలక్షన్ కమిటీ కీలక పాత్ర పోషిస్తుంది. పార్థివ్ పటేల్ పోటీకి దూరంగా ఉండటంతో ప్రజ్ఞాన్ ఓజా చీఫ్ సెలక్టర్ పదవికి బలమైన అభ్యర్థిగా కనిపిస్తున్నాడు. అయితే, అతడి నియామకంపై తుది స్పష్టత బీసీసీఐ అధికారిక ప్రకటన తర్వాతే రానుంది.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!