

భారత దేశవాళీ క్రికెట్ టోర్నీల్లో పాల్గొనడానికి భారత పాస్పోర్ట్ తప్పనిసరి చేస్తూ బీసీసీఐ తీసుకున్న నిబంధనను సవాల్ చేస్తూ 12 మంది ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా (ఓసీఐ) కార్డుదారులు బాంబే హైకోర్టును ఆశ్రయించారు. తాము భారత్లోనే నివసిస్తూ చదువుకుంటున్నామని, ఈ నిబంధన వల్ల దేశవాళీ క్రికెట్లో ఆడే అవకాశాలు కోల్పోతున్నామని పిటిషనర్లు పేర్కొన్నారు. ఐపీఎల్లోనూ పాల్గొనే అవకాశం కల్పించాలని కోరారు. విచారణ సందర్భంగా, భారత్ తరఫున ఆడాలనే ఆసక్తి ఉంటే భారత పౌరసత్వం తీసుకునే అంశాన్ని పరిశీలించాలని ప్రధాన న్యాయమూర్తి మహేశ్ చంద్ర త్రిపాఠి, న్యాయమూర్తి అద్వైత్ సేత్నాలతో కూడిన ధర్మాసనం సూచించింది.
గతంలో ఓసీఐ కార్డుదారులు బీసీసీఐ అపెక్స్ కౌన్సిల్ పర్యవేక్షణలో దేశవాళీ క్రికెట్లో పాల్గొనే అవకాశం ఉండేదని పిటిషనర్ల తరఫు వాదన. అయితే, బీసీసీఐ తరఫు న్యాయవాది డాక్టర్ బీరేంద్ర సరాఫ్ వాదిస్తూ, ప్రస్తుత చట్టాల ప్రకారం ఓసీఐ కార్డుదారులు అంతర్జాతీయ స్థాయిలో భారత్కు ప్రాతినిధ్యం వహించలేరని కోర్టుకు తెలిపారు. ఓసీఐ కార్డుదారులపై పౌరసత్వం మార్చుకోవాలని తాము ఒత్తిడి చేయడం లేదని స్పష్టం చేసిన న్యాయస్థానం, భారత పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకున్న పిటిషనర్ల దరఖాస్తుల ప్రస్తుత స్థితిపై వివరాలు సమర్పించాలని బీసీసీఐ, కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణను నవంబర్ 25కి వాయిదా వేసింది.



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!