

జపాన్‌లో జరుగుతున్న ఆసియా పారా గేమ్స్ 2026లో తెలంగాణకు చెందిన పారా అథ్లెట్ దీప్తి జీవంజి అద్భుత ప్రతిభ కనబరిచారు. మహిళల 400 మీటర్ల టీ20 విభాగంలో 56.36 సెకన్లలో రేసును పూర్తి చేసి, రికార్డు సృష్టించడంతో పాటు స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకున్నారు. ఈ చారిత్రాత్మక విజయంపై తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. దీప్తికి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ, ఆమె సాధించిన ఘనత తెలంగాణ రాష్ట్రానికి గర్వకారణమని పేర్కొన్నారు.
దీప్తి విజయం దేశవ్యాప్తంగా ఉన్న పారా అథ్లెట్లతో పాటు యువ క్రీడాకారులకు స్ఫూర్తినిస్తుందని సీఎం అన్నారు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా పట్టుదల, ఆత్మవిశ్వాసంతో కృషి చేస్తే లక్ష్యాలను సాధించవచ్చని దీప్తి నిరూపించారని ప్రశంసించారు. భవిష్యత్తులోనూ మరిన్ని అంతర్జాతీయ పతకాలు సాధించి తెలంగాణతో పాటు భారతదేశ కీర్తిప్రతిష్ఠలను ప్రపంచ వేదికపై చాటాలని ఆకాంక్షించారు.



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!